గర్జించు జూనియర్ అంటున్న నందమూరి ఫ్యాన్స్
జూనియర్ తన మావయ్య అయిన చంద్రబాబు అరెస్ట్ మీద కనీసం రెస్పాండ్ కాకపోవడం పట్ల చర్చ అయితే వీర లెవెల్ లో సాగుతోంది.
ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం జరిగింది. ఏనాడు కోర్టు మెట్లు కూడా ఎక్కని నారా చంద్రబాబు ఇపుడు ఏకంగా రిమాంద్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఒక విధంగా టీడీపీకి ఇది షాకింగ్ పరిణామం. ఎవరు అరెస్ట్ అయినా చంద్రబాబు మా వెనక ఉన్నారు అని టీడీపీ శ్రేణులు లీడర్స్ పూర్తి డేరింగ్ గా ఉండేవారు.
అలాంటి అండ దండ అయిన పెద్దాయన చంద్రబాబే జైలు గోడల మధ్య బంధీ అయిపోయారు. దాంతో టీడీపీ శ్రేణులలో పూర్తి నైరాశ్యం ఆవహించింది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ నుంచి రిమాండ్ కి వెళ్లే దాకా గత మూడు రోజులుగా చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ అన్న వార్త వినడంతోనే నందమూరి ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని విజయవాడ వచ్చింది. బాలయ్య, బ్రాహ్మణి, బాబు సతీమణి భూవనేశ్వరి, నారా లోకేష్ అంతా కూడా బాబుని పరామర్శించారు. వారంతా కోర్టు ఆవరణలోనే కనిపించారు. ఇక సినీ ప్రముఖులు వివిధ రంగాల ప్రముఖుల నుంచి మద్దతు కూడా బాబుకు దక్కింది.
అయితే ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫుల్ సైలెంట్ గా ఉండడం. జూనియర్ తన మావయ్య అయిన చంద్రబాబు అరెస్ట్ మీద కనీసం రెస్పాండ్ కాకపోవడం పట్ల చర్చ అయితే వీర లెవెల్ లో సాగుతోంది. నిజానికి జూనియర్ ఎపుడూ రాజకీయ ప్రకటనలు ఇవ్వరు. ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తారు.
కానీ ఇపుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. టీడీపీకి పెద్ద దిక్కు లాంటి చంద్రబాబు పాలు అయ్యారు. టీడీపీ శ్రేణులు మొత్తం షాకింగ్ మోడ్ లో ఉన్నాయి. నారా లోకేష్ అయితే తన తండ్రిని రిమాండ్ కి తరలించడం పట్ల పూర్తి భావోద్వేగాలకు గురి అవుతూ ఏకంగా అయిదు కోట్ల మంది ప్రజలకు లేఖ రాసారు.
ఈ కీలక సమయంలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏ తప్పూ చేయని తన తండ్రి జైలు పాలు అయ్యారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇంతలా లోకేష్ తనకు మద్దతు కావలని కోరుతున్న వేళ జూనియర్ సైలెంట్ గా ఉండడం పట్ల సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ బాబు అరెస్ట్ రిమాండ్ మీద స్పందించాలని ఆయన ఫ్యాన్స్ కూడా గట్టిగా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ కీలకమైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని నందమూరి అభిమానులు అంతా ఒక్కటే కోరుతున్నారు. జూనియర్ ఇప్పటిదాకా మౌనంగానే ఉన్నారు. ఇకనైనా అది వీడాలని బాబుకు టీడీపీకి అండగా నిలవాలని వారు కోరుకుంటున్నరు. ఇక జూనియర్ మౌనం పట్ల టీడీపీ క్యాడర్ కూడా ఆగ్రహంగా ఉంది అని అంటున్నారు.
అయితే జూనియర్ ఫ్యాన్స్ కొంతమంది అయితే రాజకీయాలు ఎపుడూ జూనియర్ ప్రస్తావించరని అంటున్నారు. ఆయన తన పని ఏంటో తన సినిమాలు ఏంటో చేసుకుంటూ వెళ్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. అలాగే జూనియర్ ని ఎపుదూ నందమూరి కుటుంబం పట్టించుకోలేదని అందుకే ఆయన మౌనం కూడా కరెక్టే అని అంటున్న వారూ ఉన్నారు.
అయితే మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం ఏదో టైం చూసుకుని జూనియర్ బాబు అరెస్ట్ రిమాండ్ మీద కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా ఇపుడు అందరి చూపూ జూనియర్ మీద ఉంది. ఈ నందమూరి హీరో బాబు అరెస్ట్ మీద ఏమి మాట్లాడుతారు, తన మామయ్య రిమాండు ఖైదీగా వెళ్లిన ఘటన మీద ఏ విధంగా తన మనోభావాలను వ్యక్తం చేస్తారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. గర్జించు జూనియర్ అంటోంది నందమూరి అభిమాన గణం. నిజంగా జూనియర్ గర్జిస్తే అది ఏపీ రాజకీయాలలో అసలైన సంచలనం అవుతుంది అని అంటున్న వారూ ఉన్నారు. ఇంతకీ జూనియర్ గర్జిస్తారా. వెయిట్ అండ్ సీ.