14 వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు ఏం జరగబోతుంది?
తమ పంటలకు కనీస మద్దతు ధరలకు ప్రకటించడంతోపాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
తమ పంటలకు కనీస మద్దతు ధరలకు ప్రకటించడంతోపాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటు ఎదుట ధర్నాకు బయలుదేరిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో రైతులు తమ పోరును మరింత ఉధృతం చేయనున్నారు.
తాజాగా జరిగిన చర్చల్లో పంటకు కనీస మద్దతు ధర అంశంలో కేంద్రం ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. దీంతో ఢిల్లీ చలో పేరిట తమ నిరసనను మళ్లీ ఫిబ్రవరి 21 నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పంజాబ్, హరియాణా మధ్య శంభు సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు ఢిల్లీ వైపు కదలడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాంతో దేశ రాజధానిలో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోకి ప్రవేశించే మార్గాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ వైపు వెళ్లడానికి పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 14వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులతో సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే పోలీసులు పెట్టే బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను కూడా రైతులు తమ వెంట తీసుకెళ్తున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడానికి హరియాణా, పంజాబ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వెల్లడించింది. ఆందోళనకారుల్లో కొందరు శంభు వద్దకు బుల్డోజర్లు, ఎర్త్ మూవర్స్ వంటివి తీసుకువచ్చారని తెలిపింది. భారీ మెషినరీని, ట్రాక్టర్లను ఆపరేట్ చేసే వ్యక్తులకు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్ల నుంచి నుంచి రక్షణ కల్పించేలా క్యాబిన్లకు ఐరన్ షీట్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. వారిని ఢిల్లీ వైపు రాకుండా అడ్డుకోవాలని సూచించింది.
కాగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్ ను సమావేశపర్చాలని రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పంథేర్ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళను అడ్డుకునేందుకు హరియాణాలోని సరిహద్దు గ్రామాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారని మండిపడ్డారు. తాము చేసిన నేరం ఏమిటి..? అని ప్రశ్నించారు. తమను అణచివేసేందుకు ఇలా బలగాలను ప్రయోగిస్తారని అస్సలు అనుకోలేదన్నారు.
తాము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు.
కాగా పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.