ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈసారి ఈ నలుగురు కీలక నేతల అరెస్టు!
ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రా«ఘవ్ చద్దా (హీరోయిన్ పరిణితి చోప్రా భర్త), తనను అరెస్టు చేస్తారని ఆతిశీ తాజాగా బాంబుపేల్చారు.
ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఢిల్లీ మద్యం విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలోని మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు అరెస్టు అయ్యారు. వీరిలో కొందరికి బెయిల్ దక్కింది.
ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి ఆతిశీ తాజాగా మరో బాంబుపేల్చారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు మరో నలుగురు ఆప్ నేతలను అరెస్టు చేస్తారని ఆరోపించారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, దుర్గేశ్ పాఠక్, రా«ఘవ్ చద్దా (హీరోయిన్ పరిణితి చోప్రా భర్త), తనను అరెస్టు చేస్తారని ఆతిశీ తాజాగా బాంబుపేల్చారు.
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం తిహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణలో ఆయన సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి నిందితుడు విజయ్ నాయర్.. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులయిన ఆతిశీ, సౌరభ్ లకు కలుస్తూ ఉండేవాడని.. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ఒప్పుకున్నారని ఏఎస్‌జీ ఎస్వీ రాజు కోర్టుకు నివేదించారు.
ఈ నేపథ్యంలో తన పేరు, సౌరభ్ పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిశీ ఘాటుగా స్పందించారు. తమను అరెస్టు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈడీ.. కోర్టులో తన పేరును, సౌరభ్ పేరును ప్రస్తావించిందన్నారు. కానీ వాస్తవానికి ఈ విషయాన్ని ఈడీ, సీబీఐ ఎప్పటి నుంచో చెబుతున్నాయని ఆతిశీ గుర్తు చేశారు.
తమ నేతలను అరెస్టు చేసినా పార్టీ ఐక్యంగా ఉండటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని ఆతిశీ ఆరోపించారు. అందుకే తమ పార్టీలో తనతో కలిపి మరో నలుగురు నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీలో చేరితే అరెస్టును తప్పించుకోవచ్చని, రాజకీయ భవిష్యత్ సైతం బాగుంటుందని ఒక బీజేపీ నేతతో తనకు చెప్పించారని ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని ఆరోపించారు.
కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయబోరని ఆతిశీ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనపై ఉన్నవి అభియోగాలేనన్నారు. రెండేళ్లు జైలుశిక్ష పడితేనే ప్రజాప్రతినిధిగా ఉండటానికి వీలుండదని గుర్తు చేశారు. అయితే కేజ్రీవాల్ ను దోషిగా నిర్ధారించలేదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.