మాధవీలతపై ఎందుకు కేసు నమోదు చేశారు?

ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఆమెపై ఐపీసీ సెక్షన్ 295/ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-04-22 04:48 GMT

హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలోని సిద్ధి అంబర్ బజారులో ఆమె మసీదును లక్ష్యంగా చేసుకుని విల్లు ఎక్కుపెట్టినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వివాదాస్పదమైంది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

కొద్ది రోజుల క్రితం శ్రీరామనవమి సందర్బంగా జరిగిన శోభాయాత్రలో ఆమె వ్యవహరించిన తీరు కలకలం రేపింది. సిద్ధి అంబర్ బజార్ మీదుగా శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఓ మసీదును టార్గెట్ చేసుకుని బాణం వదులుతున్నట్లు స్టిల్ ఇవ్వడంతో గొడవకు కారణమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగించాయి.

 

దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పలు ఆరోపణలు చేశారు. పాతబస్తీలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మహ్మద్ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వివాదం పెరిగింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దీంతో బేగంబజార్ పోలీసులు మాధవీలతపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన ఆమెపై ఐపీసీ సెక్షన్ 295/ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారోనని అందరు ఉత్కంఠగా చూస్తున్నారని మాత్రం అర్థం అవుతోంది.

పాతబస్తీలో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. బీజేపీని లక్ష్యంగా చేసుకుని మజ్లిస్ ముందుకు వెళ్తుంటే ఇక్కడ విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదని పలువురు ఆలోచిస్తున్నారు.

Tags:    

Similar News