చంద్రగిరిలో తొలి అడుగు... చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందా?
ఇందులో ప్రధానంగా... చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు.
గత 45 రోజులుగా ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయనే అనుకోవాలి. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అవ్వకముందువరకూ ఏపీలో రాజకీయాలూ ఒకరకంగా ఉంటే... ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన అనంతరం చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ - జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన ఒకటి కాగా... గతంలో ఎన్నడూ లేనివిధంగా భువనేశ్వరి పార్టీపనులమీద ప్రజల్లోకి రావడం!
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై 45 రోజులు అయ్యినా ఇప్పటికీ ఆయనకు బెయిల్ రాలేదు! దీంతో... టీడీపీ పెద్దలు, బాబు కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బాలయ్య తాను చేస్తానని ప్రకటించిన ఓదార్పు యాత్రకు "నిజం గెలవాలి" అనే పేరుపెట్టి భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారభింస్తున్నారు. మరోపక్క నంద్యాలలో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీని లోకేష్ మొదలుపెట్టబోతున్నారు.
ఈ రెండు యాత్రల మధ్యలో యువగళం సైడ్ అయిపోయిందన్న సంగతి కాసేపు పక్కనపెడితే... చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి నిజం గెలవాలని జనం మధ్యకు వెళుతున్నారు. నారావారి పల్లె నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో కొంతమంది మరణించారని.. వారి వారి కుటుంబాలను పరామర్శించాలని భువనేశ్వరి బయలుదేరుతున్నారు. ఈ సమయంలో టీడీపీ ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్నారు.
ఇందులో ప్రధానంగా... చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వరుసగా నాలుగు వారాలపాటు వీకెండ్స్ లో వినూత్న కార్యక్రమాలూ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అవిమాత్రమే చాలవని భావించిన పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. ఆ తర్వాత నారావారిపల్లిలో గ్రామ దేవత, కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు - అమ్మనమ్మల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ట్విట్టర్ లో స్పందించారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని.. ఈ ప్రయాణం భారంగా ఉందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... "ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో "నిజం గెలుస్తుంది" అని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో తొలిరోజు పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన చిన్నబ్బ, చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారని చెబుతున్నారు. అనంతరం...అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా తెలుగుదేశం శ్రేణులు ఏర్పాట్లు చేశారని అంటున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సు కూడా ఇప్పటికే సిద్ధమైన సంగతి తెలిసిందే.
అయితే... ఈ నిజం గెలవాలి కార్యక్రంలో భాగంగా భువనేశ్వరి ఏమేరకు ప్రజలను ఆకర్షించగలుగుతారు అనేది చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా మహిళలను ఏమేరకు ఆకట్టుకోగలుగుతారు.. తన భర్త జైల్లో ఉన్నారనే విషయాన్ని (అవినీతి కేసు అనే టాపిక్ తెరపైకి రాకుండా) ఎంత సెంటిమెంట్ గా ప్రజల్లోకి తీసుకెళ్తారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. మరి ఈ యాత్రలో భువనేశ్వరి సక్సెస్ అయితే... బాబు ఈ యాత్ర ఏర్పాటుచేయడం వెనుకున్న లక్ష్యం నెరవేరినట్లే!