భార్య భర్తల తగులాట.. ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన లుఫ్తాన్సా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి ల్యాండ్ చేశారు.
అవును.. విమానంలో ప్రయాణిస్తున్న మొగుడు పెళ్లాల మధ్య గొడవ అనూహ్య పరిణామానికి కారణమైంది. స్విట్జర్లాండ్ నుంచి బ్యాంకాక్ బయలుదేరిన లుఫ్తాన్సా విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి ల్యాండ్ చేశారు. ఇంతకూ ఇలాంటి పరిస్థితికి దారి తీసిన కారణాల్ని చూస్తే..
భార్యభర్తల మధ్య మొదలైన గొడవ.. అభ్యంతరకర పరిస్థితులు చోటుచేసుకోవటంతో హడలి పోయిన విమాన సిబ్బంది.. అత్యవసరంగా విమానాన్ని దారి మళ్లించారు. అయితే.. ఈ భార్య భర్తలు ఇద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వారు కావటం గమనార్హం. భర్త జర్మన్ కాగా.. భార్య థాయ్ లాండ్ కు చెందిన వారిగా చెబుతున్నారు. తొలుత భార్యనే విమాన సిబ్బందికి కంప్లైంట్ చేసినట్లుగా చెబుతున్నారు.
థాయ్ జాతీయురాలైన భార్య.. తన జర్మన్ భర్త గురించి.. అతడి ప్రవర్తన గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తన భర్త తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడని.. సిబ్బంది కలుగజేసుకోవాల్సిందిగా కోరారు. వీరి మధ్య నడుస్తున్న గొడవ గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వెల్లడించిన పైలెట్లు తొలుత పాకిస్థాన్ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని భావించారు.
కానీ.. కొన్ని కారణాలతో ఆ ప్రయత్నం అమలు కాలేదు. దీంతో.. ఢిల్లీలో ల్యాండింగ్ కు అనుమతి కోరారు. అధికారులు అందుకు పర్మిషన్ ఇవ్వటంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం ఈ జంటను విమానం నుంచి దించేయగా.. వారి వద్దకు వెళ్లిన అధికారులు వారితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఆ విమానం టేకాఫ్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. భార్యభర్తల మధ్య గొడవ ఒక విమానం అత్యవసర ల్యాండింగ్ వరకు వెళ్లిన వైనం హాట్ టాపిక్ గా మారింది.