బాలినేని మోసపోయారా ?
ఇవన్నె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించే. ఆయన పాతికేళ్ళ రాజకీయంలో ఎపుడూ పైచేయిగానే ఉంటూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఆయన మోసపోయారా అన్న చర్చ అయితే వస్తోంది.
పాతికేళ్ళకు పైగా రాజకీయ జీవితంతో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాలిటిక్స్ ఇపుడు ఏ వైపు అని అంతా ప్రశ్నిస్తున్న సందర్భం. బాలినేని ముక్కు సూటి రాజకీయం వికటించిందా లేక ఆయన కుండబద్ధలు కొట్టే తీరుకు క్లైమాక్స్ పొలిటికల్ ట్విస్ట్ ఇదేనా అని కూడా చర్చించుకుంటున్నారు.
రాజకీయాల్లో ఉన్న వారికి పదవుల మీద ఆశ ఉంటుంది. కానీ పదవులే పరమార్థం అయితే కాదు. అందునా సీనియర్ మోస్ట్ లీడర్లుగా ఉన్న వారు సొంత వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా జనాలకు చేరువ అయిన వారు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిస్తే అసలు బాగుండదు అంతే కాదు తమది కాని చెప్పులో కాలు పెడితే కూడా వేలు కూడా లోపలికి దూరదు, పైగా నొప్పి అదనం అవుతుంది.
ఇవన్నె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించే. ఆయన పాతికేళ్ళ రాజకీయంలో ఎపుడూ పైచేయిగానే ఉంటూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఆయన మోసపోయారా అన్న చర్చ అయితే వస్తోంది. దివంగత నేత వైఎస్సార్ చలువతో 1999లో తొలిసారి ఒంగోలు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని 2004, 2009లలోనూ వరసగా గెలిచారు. ఇక వైఎస్సార్ రెండవసారి సీఎం అయ్యాక బాలినేనిని మంత్రిని చేసారు.
అయితే వైఎస్సార్ మరణానంతరం బాలినేని జగన్ సైడ్ తీసుకున్నారు. వైసీపీలో ఆయన పునాదుల నుంచి ఉంటూ వచ్చారు. 2012 ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. అయితే 2014లో బాలినేని ఓడారు 2019లో మళ్ళీ గెలిచారు. తొలి మూడేళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.
ఇక జగన్ ముందే చెప్పి మరీ చివరి రెండేళ్ల కాలానికి మంత్రి మండలిలో మార్పులు చేశారు. అలా చాలా మందితో పాటుగానే బాలినేని మంత్రి పదవి పోయింది. నాటి నుంచి అసంతృప్తిని పెంచుకున్న బాలినేని 2024 ఎన్నికల ముందే టీడీపీలో టీడీపీలో చేరాలనుకున్నారని ఆయనే స్వయంగా మీడియాకు ఇటీవల చెప్పారు.
ఏదైతేనేమి ఆయన జనసేనలో చేరారు. అది కూడా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలన్న ఒప్పందం మేరకే ఆయన వైసీపీని వీడి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు అని ప్రచారం సాగింది. ఇక ఎమ్మెల్సీ సీటుని కూడా ఆయనే ఖాళీ చేయిచి పెట్టుకున్నారు అని మరో ప్రచారం సాగింది.
జయమంగళం వెంకటరమణ అనే ఎమ్మెల్సీతో రాజీనామా చేయించింది బాలినేని అన్న పుకార్లూ వినిపించాయి. ఇక ఎమ్మెల్సీగా నెగ్గితే మంత్రి పదవికి జనసేన అధినేత పవన్ హామీ ఇచ్చారు అన్న దాంతో బాలినేని ఆయన అనుచరులు ఊహాలోకంలోనే విహరించారు అని అంటున్నారు.
అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలినేనికి దక్కాల్సిన మంత్రి పదవి కాస్తా ఇపుడు పవన్ సొంత సోదరుడు నాగబాబుకు వెళ్తోంది. ఆ విధంగా జరగడానికి తెర వెనక స్కెచ్ ఎవరు గీసారు ఏమో తెలియదు కానీ ఇపుడు బాలినేని రాజకీయం క్రాస్ రోడ్స్ మీదకు వచ్చిందని అంటున్నారు.
వైసీపీ కాంగ్రెస్ లలో తనను ఆదరించిన వైఎస్ కుటుంబాన్ని కాదనుకుని అత్యాశకు పోయి పార్టీ మారిన బాలినేని ఇలా వచ్చి అలా మినిస్టర్ పోస్టు దక్కించుకోవడం అంత సులువు అని ఎలా అనుకున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు.
ఆయనకు టీడీపీ, జనసేనల నుంచే సరైన ఆదరణ దక్కడంలేదు అని అంటున్నారు. ఒంగోలులో ఉన్న టీడీపీ జనసేన నేతలు బాలినేనిని ఇప్పటికీ వైసీపీ నేతగానే చూస్తున్నారు. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా వారు ఊరుకునే సీన్ అయితే లేదు అని అంటున్నారు.
మరి మొదటి నుంచి ఉన్న వారిని కాదనుకుని అయిదేళ్ళ పాటు అధికార పార్టీలో ఉంటూ అన్నీ అనుభవించి ఈ రోజు పార్టీ ఫిరాయించి వచ్చిన బాలినేనికి పెద్ద పీట కూటమి పెద్దలు ఎలా వేస్తారు అని ఆయన అనుకున్నారో తెలియదు అంటున్నారు.
ఇక తాను అపుడే మంత్రి అయినట్లుగా భావించి బాలినేని జగన్ మీద పర్సనల్ గా కూడా కామెంట్స్ చాలా గట్టిగానే చేశారు. దాంతో ఆయన మళ్లీ వైసీపీ గూటికి వెళ్ళే ప్రసక్తే లేకుండా చేసుకున్నారు అని అంటున్నారు. ఈ దెబ్బతో బాలినేని జీవితం ఎటూ కాకుండా పోయింది అని అంటున్నారు.
ఇక బాలినేనికి హామీ ఇచ్చి తన సోదరుడిని మంత్రి పదవితో సక్తరించాలనుకోవడం వెనక పవన్ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. జనసేనలో రెడ్లకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకోవడానికి బాలినేనికి మంత్రి పదవి అని పవన్ పట్టుబట్టారని కూడా ఒక దశలో ప్రచారం సాగింది. అలా జరిగి ఉంటే పవన్ హామీకి కూడా ఎంతో ప్రాముఖ్యత వచ్చేదని అంటున్నారు.
ఇపుడు బాలినేనిని పవన్ ఎలా అకామిడేట్ చేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే బాలినేని ఇంట్లో ఏడుపులు మొదలయ్యాయని అంటున్నారు. ఆశకు పోతే ఇలాగే ఉంటుంది అని బాలినేని మీద కామెంట్స్ పడుతూంటే హామీలు ఇచ్చి ఇలా చేస్తే రేపటి రోజున చేరే నేతలు ఎంత మంది ఉంటారు అన్నది కూడా జనసేన వైపుగా ప్రశ్నలు సంధిస్తున్న వైనం ఉంది.