గద్వాల రాజకీయం అంటే అంతే.. మళ్లీ బీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యే బండ్ల

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల-అలంపూర్ ప్రాంతాలను నడిగడ్డగా పిలుస్తుంటారు.

Update: 2024-07-30 08:27 GMT

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల-అలంపూర్ ప్రాంతాలను నడిగడ్డగా పిలుస్తుంటారు. క్రిష్ణా, తుంగభద్ర నదులకు మధ్యన ఉన్నందున ఈ పేరు వచ్చింది. వ్యవసాయానికి నీరు బాగా లభ్యమయ్యే ఈ రెండు నియోజకవర్గాలకు, మిగతా 12 నియోజకవర్గాలకు రాజకీయంలో ఎంతో తేడా ఉంటుంది. ఇక గద్వాల జనరల్ కాగా, అలంపూర్ 2009లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. మధ్యలో కొన్నిసార్లు తప్ప గద్వాల నుంచి ధర్మవరపు కొట్టం (డీకే) కుటుంబం 50 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తోంది. డీకే సమరసింహారెడ్డి, డీకే భరతసింహారెడ్డి, ఆయన భార్య డీకే అరుణ ఎమ్మెల్యేలుగా గెలిచారు. సమరసింహారెడ్డి, భరతసింహారెడ్డిల మేనల్లుడే గద్వాల ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. కాగా, సమరసింహారెడ్డి ఉమ్మడి ఏపీలో జనార్దన్రెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో నెంబర్ 2 అనే పేరు తెచ్చుకున్నారు.

అత్తతో విభేదించి..

కృష్ణమోహన్‌రెడ్డి తొలుత జడ్పీటీసీగా పనిచేశారు. మేనమామ భరత సింహారెడ్డి గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతా తానై చక్రం తిప్పారు. అయితే, అత్త డీకే అరుణ ఎమ్మెల్యే అయ్యాక మాత్రం ఆమెతో విభేదించారు. వైసీపీ, బీఆర్ఎస్ లోకి వెళ్లారు. 2018లో డీకే అరుణపై బీఆర్ఎస్ నుంచే గద్వాలలో గెలిచారు. 2023లో మహిళా అభ్యర్థిని సరితపై విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కృష్ణమోహన్‌రెడ్డి ఇటీవల ఆ పార్టీలో చేరారు. ఇది జరిగి నెల కూడా కాలేదు.. ఇంతలోనే మంగళవారం తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్ కు బూస్ట్.. కాంగ్రెస్ కు లాస్

ఇప్పటికే పదిమంది (గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితో కలిపి) ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ కు తాజా పరిణామం పెద్ద ఊరట అనే చెప్పాలి. ఇదే సమయంలో ఇది కాంగ్రెస్ కు దెబ్బనే. సీఎం రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోవడం ఇబ్బందికర పరిణామమే.

ఇంతకూ ఏం జరిగిందో?

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అనూహ్య నిర్ణయం వెనుక ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. వాస్తవానికి వీరి మేనమామల కుటుంబ (డీకే) దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉంది. కృష్ణమోహన్‌రెడ్డి పెద్ద మేనమామ డీకే సమరసింహారెడ్డి ఇటీవల మళ్లీ కాస్త చురుగ్గా కనిపిస్తున్నారు. ఈయనతో కృష్ణమోహన్‌రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. అయినా.. మళ్లీ బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్లారో అంతుపట్టడం లేదు. వాస్తవానికి గద్వాల రాజకీయాలు ఎవరికీ అర్థంకావు అని అంటారు. వీటిని బంగ్లా రాజకీయాలు అని కూడా అంటారు.

Tags:    

Similar News