సల్మాన్ తో స్నేహమే సిద్ధిఖ్ కి శాపమైందా?... ముంబై మళ్లీ గ్యాంగ్ స్టర్స్ చేతుల్లోకి?

చాలాకాలం తర్వాత ముంబైలో గ్యాంగ్ స్టర్స్ కి చెందిన తుపాకీల శబ్ధం వినిపించింది.

Update: 2024-10-13 05:45 GMT

చాలాకాలం తర్వాత ముంబైలో గ్యాంగ్ స్టర్స్ కి చెందిన తుపాకీల శబ్ధం వినిపించింది. ఆ శబ్ధం సక్సెస్ కూడా అయ్యింది! ఈ కాల్పుల్లో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ మృతి చెందారు. దీంతో... ఆర్ధిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో ముంబై మళ్లీ గ్యాంగ్ స్టర్స్ చేతుల్లోకి వెళ్తోందా అనే చర్చ మొదలైంది.

అవును... ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ బాబా సిద్ధిక్ ని శనివారం సాయంత్రం తన కుమారుడు కార్యాలయం వెలుపల దసరా సంబరాల్లో ఉండగా దుండగులు కాల్చి చంపారు. ఈ సమయంలో బుల్లెట్లు ఛాతిలోకి, పొట్టలోకి వెళ్లాయి.. హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించగా.. బుల్లెట్ల గాయంతో మృతి చెందారు.

ఈ సమయంలో ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు హర్యానాకు చెందిన బల్జీత్ సింగ్ (23), యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేష్ (19) అని చెబుతున్నారు. అతని హత్యలో పాల్గొన్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవారని అంటున్నారు.

ప్రస్తుతం జైల్లో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ పై.. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై కాల్పులకు పాల్పడి ఘటనలో ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యకు ముందు నిందితులు సుమారు 25 నుంచి 30 రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు చెబుతున్నారు! ఈ కాల్పుల్లో పాల్గొన్న ముగ్గురు నిందితులు ఆటో రిక్షాలో స్పాట్ కి చేరుకున్నట్లు చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉండగా.. ముగ్గురు వాంటెడ్ గ్యాంగ్ స్టర్స్ అమెరికా నుంచి ఇతని ముఠాను నడుపుతున్నట్లు చెబుతున్నారు. యూఎస్ లో నివసిస్తున్న లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఈ ముఠాను నిర్వహిస్తున్నాడని.. ఇటీవల సల్మాన్ ఖాన్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న షూటర్లతో ఇతడే కో ఆర్డినేషన్ చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు!

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే... దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ గ్యాంగ్ స్టర్స్ రాజ్యం వచ్చిందేమో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా బాంధ్రా ఏరియాలో ఇలాంటి ఘటన జరగడంతో ఈ వ్యవహారం అక్కడి స్టార్లలో మరింత ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు.

పైగా... ముంబైలో ఉండే గ్యాంగ్ స్టర్స్ అందరికీ ఏదో ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుల మద్దతు ఉంటుందని చెబుతుంటారు. మరింత ప్రధానంగా... నవంబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుందని అంటున్న నేపథ్యంలో... ఈ గ్యాంగ్ స్టర్స్ తుపాకీ శబ్ధాలు ఇప్పుడు ముంబైలో కొత్త చర్చకు తెరలేపాయి!

కాగా... బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన బాబా సిద్ధిక్.. 2004-08 మధ్య సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ నాయకత్వంలో ఆహార & పౌరసరఫరాలు, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ తో విభేదాల కారణంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్.సీ.పీలో చేరారు.

సల్మాన్ తో స్నేహమే శాపమైందా..?:

బాలీవుడ్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ తో బాబా సిద్ధిఖ్ అత్యంత సన్నిహితంగా ఉంటారనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాబా సిద్ధిఖ్ ని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏప్రిల్ లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన షూటర్లలో ఒకరు ముంబై పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన బిష్ణోయ్ గ్యాంగ్ కు కోపం తెప్పించిందనే చర్చా తెరపైకి వచ్చింది.

ఇక గతేడాది సల్మాన్ ఖాన్ తో ఆల్బమ్ లో కనిపించిన తర్వాత కెనడాలోని పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపైనా ఓ ముఠా కాల్పులు జరిపింది. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన గ్యాంగ్... సల్మాన్ ను గిపీ గ్రేవాల్ సోదరుడిలా చూసుకుంటారని పేర్కొంది.

ఇలా సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉండేవారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుందా అనే చర్చా తెరపైకి వచ్చింది. బిష్ణోయ్ కమ్యునిటీ కృష్ణజింకను ఆరాధిస్తుందని.. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుందని అంటున్నారు!

Tags:    

Similar News