గంగూలీ కి ఎందుకుంత కోపం వచ్చింది?.. అసలు విషయం ఏమిటి?

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సౌరభ్ గంగూలీ.. సదరు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Update: 2024-09-19 03:53 GMT

టీం ఇండియా మజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీకి కోపం వచ్చింది. దాదాను టార్గెట్ చేస్తూ ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ అభ్యంతరకర వీడియోనే ఇందుకు కారణం. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సౌరభ్ గంగూలీ.. సదరు యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అవును... టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీపై ఓ యూట్యూబర్ అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేశాడు! దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు దాదా. కాగా.. గంగూలీపై ఇలా అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసిన యూట్యూబర్ పేరు మృణ్మోయ్ దాస్ అని తెలుస్తోంది. దాదా ఆగ్రహం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... కోల్ కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్జీ కార్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న ట్రైనీ వైద్యురాలిపై జరిగిన ఘోరం దేశాన్ని కదిలించింది. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా కోల్ కతాలో జరిగిన క్యాండిల్ లైట్ ప్రొటెస్టులోనూ దాదా పాల్గొన్నారు.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన గంగూలీ... ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయని.. దురదృష్టవశాత్తు ఆస్పత్రులో ఈ సంఘటన జరిగిందని.. అందువల్ల ప్రతీచోటా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అన్నారు! దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి!!

దీంతో గంగూలీ స్పందించాడు. తన వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థంచేసుకుందని వివరణ ఇచ్చాడు. అయితే... ట్రైనీ వైద్యురాలి హత్యపై గంగూలీ పోస్టును ఆయుధంగా చేసుకున్న యూట్యూబర్ మృణ్మోయ్ దాస్ వీడియోలతో విరుచుకుపడ్డాడు. దీంతో... ఈ వీడియోలపై గంగూలీ సీరియస్ అయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు గంగూలీ కార్యదర్శి పశ్చిమ బెంగాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా... మృణ్మోయ్ దాస్ అనే వ్యక్తి సౌరభ్ గంగూలీని ఉద్దేశించి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశాడని.. గంగూలీ ప్రతిష్టకు హాని కలిగించే పదజాలం ఉపయోగించి, అవమానకర వ్యాఖ్యలు చేశాడని పేర్కొనాడు.

ఈ వీడియోలో గంగులీపై దాడి చేయడమే కాకుండా.. ప్రతీ వ్యక్తికి దక్కాల్సిన గౌరవానికి భగం కలిగించేలా వ్యాఖ్యానించారని పేర్కొన్నాడు. ఈ విషయంలో తాము పోలీసుల జోక్యాన్ని అభ్యర్థిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంలో న్యాయం జరిగేలా వేగంగా అవసరమైన చర్యలు తీసుకుంటారని విశ్వసిస్తున్నామని తెలిపాడు.

Tags:    

Similar News