షాకిచ్చిన అపర కుబేరుడు అదానీ!

ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ అపర కుబేరుల్లో ఒకరు, అదానీ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ సంచలన ప్రకటన చేశారు.

Update: 2024-08-05 09:47 GMT

ప్రపంచంలోనే టాప్‌ టెన్‌ అపర కుబేరుల్లో ఒకరు, అదానీ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ సంచలన ప్రకటన చేశారు. తనకు 70 ఏళ్లు రాగానే కంపెనీ గ్రూప్‌ చైర్మన్‌ గా వైదొలుగుతానని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం గౌతమ్‌ అదానీ వయసు 62 ఏళ్లు. ఆయన చెబుతున్న లెక్క ప్రకారం ఆయనకు 70 ఏళ్లు రావాలంటే మరో 8 ఏళ్లు సమయం ఉంది. తనకు 70 ఏళ్లు రాగానే తన గ్రూపు సంస్థల బాధ్యతలను తన కుమారులు కరణ్, జీత్‌ లకు అప్పగిస్తానని అదానీ స్పష్టం చేశారు. అలాగే తన సోదరుల వారసులు.. ప్రణవ్, సాగర్‌ లకు కూడా బాధ్యతలను అప్పగిస్తానన్నారు.

ఈ మేరకు గౌతమ్‌ అదానీ బ్లూమ్‌ బర్గ్‌ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధ్యతల బదిలీల్లో ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా జరగాలని తన కుమారులకు సూచించానని తెలిపారు.

ప్రస్తుతం అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు 213 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అదానీ గ్రూప్‌ కింద మొత్తం 10 సంస్థలు ఉన్నాయి. మౌలిక నిర్మాణ రంగాలు, నౌకాశ్రయాలు, నౌకా రవాణా, సిమెంట్, గ్రీన్‌ హ్రైడ్రోజన్, మీడియా రంగాల్లో అదానీ గ్రూప్‌ సంస్థలు ఉన్నాయి. ఇవేకాకుండా ఇంకా పలు రంగాల్లోకి కూడా విస్తరించింది.

తాను ఉద్యోగ విరమణ చేశాక తన వారసులు తన గ్రూప్‌ సంస్థలను వేరుగా నిర్వహిస్తారా లేక ఉమ్మడిగా నిర్వహిస్తారా అనేది వారి ఇష్టానికే వదిలేశానని గౌతమ్‌ అదానీ తెలిపారు. నిర్ణయం తీసుకోవడానికి వారికి 3 నెలల సమయం ఇచ్చానని వెల్లడించారు. ఈ క్రమంలో మూడు నెలల గడువు ముగిశాక వారు తన వద్దకు వచ్చి ఉమ్మడిగానే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారన్నారు.

తన గ్రూప్‌ కంపెనీలన్నీ ట్రస్టు కింద ఉంటాయన్నారు. ఈ ట్రస్టులో తన ఇద్దరు కుమారులతోపాటు తన సోదరుల ఇద్దరు కుమారులు కూడా ఉన్నారని తెలిపారు. వీరందరికీ సమాన వాటా ఉందన్నారు. అలాగే సమాన హక్కులు ఉన్నాయన్నారు.

అదానీ గ్రూప్‌ వెబ్‌సైట్‌ ప్రకారం గౌతమ్‌ అదానీ పెద్ద కుమారుడు కరణ్‌ అదానీ.. అదానీ పోర్ట్స్‌ ఎండీగా వ్యవహరిస్తున్నారు. చిన్న కుమారుడు జీత్‌ అదానీ..అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అదానీ సోదరుల కుమారుల్లో ఒకరైన ప్రణవ్‌ అదానీ.. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ డైరెక్టర్‌ గా ఉన్నారు. అలాగే మరో సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీ.. అదానీ గ్రీన్‌ ఎనర్జీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News