గోదావరి జిల్లాల్లో అప్పుడే పొలిటికల్‌ పందేలు షురూ!

మరోవైపు కోడి పందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో అప్పుడే పొలిటికల్‌ పందేలు కూడా మొదలైపోయాయి.

Update: 2023-08-03 15:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల కు ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు విజయమే లక్ష్యంగా తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేశాయి. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఎక్కువ కాలం ప్రజల మధ్యనే ఉంటున్నారు.

మరోవైపు కోడి పందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో అప్పుడే పొలిటికల్‌ పందేలు కూడా మొదలైపోయాయి. పందెంరాయుళ్లు భారీ ఎత్తున పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. ఆలూలేదు.. చూలూ లేదు.. అప్పుడే పందేలు ఏంటి అనుకుంటున్నారా?.. ఈ పందేలు కూడా వెరైటీగా సాగుతున్నాయి.

టీడీపీ–జనసేన మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా?, బీజేపీ ని ఈ రెండు పార్టీలు కలుపుకుంటాయా? లేదా? గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? ఎన్ని గెలుస్తుంది? అలాగే జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? ఎన్ని గెలుస్తుంది? వైసీపీకి ఈసారి గోదావరి జిల్లాల్లో వచ్చే సీట్లెన్ని వంటి అంశాల పై భారీ ఎత్తున పందేలు కాస్తున్నారని తెలుస్తోంది.

అలాగే టీడీపీ–జనసేన మధ్య పొత్తు ఉండదని, జనసేన–బీజేపీ కలిసి పోటీ చేస్తాయని కూడా బెట్టింగులు కాస్తున్నారు. అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఉంటాయా? ఉండవా? ఆయా పార్టీల తరపున ఫలానా వ్యక్తికి సీటు లభిస్తుందా? లభించదా? ఫలానా పార్టీ అభ్యర్థి ఈసారి గెలుస్తాడా? ఓడిపోతాడా?.. ఇలా కాదేదీ కవిత కు అనర్హం అన్నట్టు కాదేదీ పందేల కు అనర్హం అన్నట్టు ఈ పందేలు సాగుతున్నాయని అంటున్నారు.

అదేవిధంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని భారీ ఎత్తున పందేలు జరుగుతున్నట్టు సమాచారం. కొంతమంది పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని పందేలు కాస్తున్నట్టు చెబుతున్నారు. పవన్‌ గెలుపు ఓటములపైనా పెద్ద ఎత్తున అడ్వాన్స్‌డ్‌ బెట్టింగులు కాస్తున్నట్టు పేర్కొంటున్నారు.

అలాగే పవన్‌ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయరని.. ఈసారి రాయలసీమ లోని తిరుపతి నుంచి బరి లోకి దిగుతారని పందేలు కాసేవారి శాతం ఎక్కువగానే ఉందని ప్రచారం సాగుతోంది.

మళ్లీ వైసీపీ అధికారం లోకి వస్తుందని కొందరు, అధికారం లోకి రాదని కొందరు భారీ ఎత్తున పందేలు కాస్తున్నారని అంటున్నారు. కోడి పందేలతో పాపులరైన గోదావరి జిల్లాలు ఇప్పుడు పొలిటికల్‌ పందేలతోనూ పాపులర్‌ అవుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

సంక్రాంతి వరకు కోడి పందేలు లేవు. ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నీ కూడా ముగిసింది. వచ్చే జనవరి నాటికి సంక్రాంతి, ఏప్రిల్‌/మేలో ఐపీఎల్‌ ఉంటుంది. అయితే ఈలోపుగానే పందెం రాయుళ్లు వెనక్కి తగ్గకుండా పొలిటికల్‌ పందేలు కాస్తుండటం విశేషం.

Tags:    

Similar News