గౌతు ఫ్యామిలీ నుంచి మంత్రి గిరీ కోసం ?
శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఒక విశేషం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఒక విశేషం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీలో బీసీలకు పెద్ద దిక్కుగా సర్దార్ గా ప్రఖ్యాతి గడించిన మాజీ మంత్రి స్వాతంత్ర సమర యోధుడు గౌతు లచ్చన్న కుటుంబానికి చెందిన మూడవ తరం వారసురాలు గౌతు శిరీష ఎమ్మెల్యే అయ్యారు.
ఆమె 2019లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే వైసీపీ ఊపులో ఆమె రాజకీయాలకు అప్పటికి కొత్త అయిన సీదరి అప్పలరాజు చేతిలో ఓటమి పాలు అయ్యారు. కానీ గత అయిదేళ్ల కాలంలో ఆమె చేసిన పోరాటాల ఫలితంగా 2024లో ఘన విజయం దక్కింది.
ఇక అధికారంలోకి వచ్చాక గౌతు శిరీష పలాసలో రాజకీయాన్ని వేగం పెంచేలా చేస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి సీదరి అప్పలరాజు ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఆయన వర్గాన్ని ముప్ప తిప్పలు పెడుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు సీదరి అప్పలరాజు ని రాజకీయంగా బలహీనం చేసే వ్యూహాలను రచిస్తున్నారు.
లేటెస్ట్ గా చూస్తే గౌతు శిరీష సీదరిని గృహ నిర్బంధం చేశారు అన్న దాని మీద వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పలాసలో అంతా నా రాజ్యం అన్నట్లుగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు అని వారు అంటున్నారు.
పలాసలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని అక్కడికి వెళ్ళిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. పదవుల కోసం శిరీష ఇలా చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు లోకేష్ ల దృష్టిలో పడేందుకే అకారణంగ వైసీపీ నేతల మీద కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయిస్తున్నారు అని మండిపడ్డారు
ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఎర్రన్నాయుడు గౌతు శ్యామ సుందర శివాజీ ఒకేసారి 1983లో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ జంట ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఈ ఇద్దరూ ఎన్టీయర్ హయాంలో చంద్రబాబు కోటరీలో ఉండేవారు.
ఈ ఇద్దరికీ రాజకీయంగా ఆలంబనగా చంద్రబాబు ఉండేవారు. ఇక ఎర్రన్నాయుడు రాష్ట్ర మంత్రి అవుదామని అనుకుంటే చంద్రబాబు ఆయన ముచ్చటను కేంద్ర మంత్రిగా చేసి తీర్చారు. గౌతు శివాజీకి కూడా తన మంత్రివర్గంలో కొన్నాళ్ళ పాటు చోటు ఇచ్చారు
అయితే గౌతు శివాజీ 2014లో చివరి సారిగా గెలిచినపుడు ఆ దఫాలో మంత్రి కావాలని కోరుకున్నారు. విస్తరణలో కూడా చాన్స్ రాకపోయేసరికి కన్నీరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఆయన తన వారసురాలిగా శిరీషను ప్రకటించారు.
చంద్రబాబు ఆమెకే గత రెండు సార్లూ టికెట్లు ఇస్తున్నారు. ఇక శివాజీ కోరిక ఒక్కటే అని అంటున్నారు. తన కుమార్తెను మంత్రిగా చూసుకోవడం అని అంటున్నారు. విస్తరణలో అయినా శిరీషకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారు.
దాంతోనే శిరీష కూడా తన సత్తాను చాటుకోవడానికి పలాసలో వైసీపీని సవాల్ చేస్తున్నారు అని అంటున్నారు. ఈ టెర్మ్ లోనే కాకుండా 2029లోనూ గెలిచి పలాస గౌతు ఫ్యామిలీకి కంచుకోటగా చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ఆమె ఈ విజయం తరువాత వైసీపీని గట్టిగానే టార్గెట్ చేసారు అని అంటున్నారు.
ఇక గౌతు లచ్చన్న మంత్రిగా చేశారు. శివాజీ కూడా చేశారు. శిరీష కూడా మంత్రి అయితే మూడు తరాలుగా ఆ కుటుంబం మంత్రిగా పనిచేసిన రికార్డు సొంతం అవుతుంది. బహుశా ఆ ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు. అందుకే ఆమె ఒక ప్రణాళిక ప్రకారమే పాలాసలో టీడీపీని పరుగులు పెట్టిస్తున్నారు అని అంటున్నారు.