కేసీఆర్ నిరంకుశ‌త్వ‌మే బీఆర్ఎస్‌ను ముంచిందా?

తానే రాజున‌నే నిరంకుశ‌త్వంతో త‌న‌కు న‌చ్చిన రీతిలో కేసీఆర్ సాగ‌డమే దెబ్బ‌తీసింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు.

Update: 2024-04-22 04:20 GMT

తెలంగాణ ఏర్ప‌డ్డ త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ పాలించారు. కానీ మూడోసారి ఎన్నిక‌ల్లో మాత్రం బీఆర్ఎస్‌కు షాక్ త‌ప్ప‌లేదు. సీఎంగా, పార్టీ అధినేత కేసీఆర్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో సాగార‌ని, అందుకే పార్టీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. మంచి కోరి ఎవ‌రు చెప్పినా విన‌క‌పోవ‌డం, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను అర్థం చేసుకోక‌పోవ‌డం కేసీఆర్‌కు మైన‌స్‌గా మారాయి. తానే రాజున‌నే నిరంకుశ‌త్వంతో త‌న‌కు న‌చ్చిన రీతిలో కేసీఆర్ సాగ‌డమే దెబ్బ‌తీసింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ఇప్పుడు ఆ పార్టీకే చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, శాస‌న మండలి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌లే చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

పార్టీలో కానీ ప్ర‌భుత్వంలో కానీ అంద‌రూ త‌న మాటే వినాల‌నే నియంతృత్వ ధోర‌ణితో సాగ‌డ‌మే కేసీఆర్ కొంప‌ముంచింద‌నే అభిప్రాయాలున్నాయి. ఇప్పుడు అదే నిజ‌మ‌నేలా గుత్తా సుఖేంద‌ర్ వ్యాఖ్య‌లున్నాయ‌ని చెప్పాలి. బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యమే లేదంటూ ఆయ‌న హాట్ హాట్ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నిర్మాణంలో వైఫ‌ల్యం, ఎమ్మెల్యేలే కేంద్రంగా రాజ‌కీయం న‌డ‌వ‌డంతోనే ప్ర‌స్తుతం బీఆర్ఎస్ ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని ఆయ‌న అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు కేసీఆర్‌ను క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తే క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని సుఖేంద‌ర్ పేర్కొన్నారు.

కేసీఆర్‌కు తోచిందే చేస్తార‌ని, రెండు వైపుల నుంచి ఆలోచించ‌ర‌నే అర్థం వ‌చ్చేలా సుఖేంద‌ర్ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలోని ఇద్ద‌రు నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటే అప్పుడు ఆ ఇద్ద‌రినీ పిలిపించి మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్‌లో మాత్రం అలాంటి ప‌రిస్థితే లేద‌ని గుత్తా సుఖేంద‌ర్ వెల్ల‌డించారు. ఒక్కరి మాట‌ల‌తోనే సాగినందుకే పార్టీకి న‌ష్టం క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇక 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో షాక్ తగిలినా దిద్దుబాటు దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం దెబ్బ‌కొట్టింద‌ని గుత్తా చెప్పారు. త‌న‌ను ఎవ‌రు ఓడిస్తారు? తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు తిరుగే లేద‌నే అహంకార‌మే పార్టీ ప‌త‌నానికి కార‌ణ‌మైంద‌నే అర్థం వ‌చ్చేలా గుత్తా వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News