జోగయ్య ఈజ్ బ్యాక్... పవన్ కు ఎన్నికల హామీ గుర్తు చేస్తూ లేఖ!
ఈ క్రమంలో... గోదావరి జిల్లాల అభివృద్ధి పట్ల గత వైసీపీ ప్రభుత్వంలానే నేటి కూటమి ప్రభుత్వం కూడా అలక్ష్యం వహిస్తోందని జోగయ్య మండిపడ్డారు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ ప్రముఖ కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖలు తెగ హల్ చల్ చేసేవనే సంగతి తెలిసిందే. ప్రధానంగా.. టీడీపీతో జతకట్టాలని పవన్ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆయన నిత్యం జనసేన అధినేతకు సూచనలు, సలహాలూ ఇస్తూనే ఉండేవారు.
కూటమిలో ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలి.. అవి ప్రధానంగా ఎక్కడెక్కడ అడగాలి.. ఇక రెండున్నరేళ్లు రాజ్యాధికారం ప్రతిపాదన వంటి ఎన్నో కీలక అంశాలను క్రోడీకరిస్తూ పవన్ కల్యాణ్ కు వరుసగా లేఖలు రాసేవారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సైలంట్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు మరోసారి ఓ కీలక లేఖ వదిలారు!
అవును.. ఎన్నికల ముందు వరకూ పవన్ కల్యాణ్ కు వరుస లేఖలు రాసిన చేగొండి హరిరామ జోగయ్య తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎప్పటినుంచో కేవలం నెరవేర్చని రాజకీయ హామీలుగా మిగిలిపోయి ఉన్న అంశాలను లేవనెత్తుతూ.. గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా అంటూ ఆయన ప్రశ్నించారు!
ఈ క్రమంలో... గోదావరి జిల్లాల అభివృద్ధి పట్ల గత వైసీపీ ప్రభుత్వంలానే నేటి కూటమి ప్రభుత్వం కూడా అలక్ష్యం వహిస్తోందని జోగయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా... ఉభయగోదావరి జిల్లాల్లో టెంపుల్ టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా పలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో.. నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేయడంతో పాటు.. నరసాపురం - మచిలీపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన చేయాలని అన్నారు. అదేవిధంగా.. అంతర్వేది ట్రెడ్జింగ్ హార్బర్ కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు కావాలని తెలిపారు.
వీటితో పాటుగా రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడంతోపాటు తాడేపల్లిగూడెంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇక, వశిష్ట గోదావరిపై "నరసాపురం - సఖినేటిపల్లి", కోడేరు - అయోధ్య లంక వంతెన నిర్మాణాలు చేపట్టాలని కోరారు. గోదావరి ప్రాంతంలో జాతీయ రహదారులన్నీ విస్తరణ చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఓ కీలక హామీని జోగయ్య ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇందులో భాగంగా... గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న పవన్.. ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలని అన్నారు!