కేటీఆర్ ను సీఎం చేస్తానంటే.. హరీశ్ ఆన్సర్ విన్నారా?

గొడవలు మాత్రమేకాదు ముఖ్యమంత్రి పదవి కోసం బావబావమరిదుల మధ్య అధిపత్య పోరు ఉందన్న మాటను ప్రస్తావిస్తున్నారు.

Update: 2023-11-15 04:37 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్నెల్లకు ఒక ముఖ్యమంత్రి మారతారంటూ.. ఢిల్లీకి గులాంగిరి చేయాల్సి ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా ప్రత్యర్థులు కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. గులాబీ పార్టీలోనూ కుటుంబ కలహాలు ఉన్నాయని.. పదవుల విషయంలో వారి మధ్య రచ్చ నడుస్తుందని.. గొడవలు మాత్రమేకాదు ముఖ్యమంత్రి పదవి కోసం బావబావమరిదుల మధ్య అధిపత్య పోరు ఉందన్న మాటను ప్రస్తావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వ్యాఖ్యల మీద మంత్రి హరీశ్ రావు రియాక్టు అయ్యారు.

పదవుల కోసం బీఆర్ఎస్ లో కోట్లాటలు జరుగుతున్నాయన్న వాదనలో నిజం లేదన్న హరీశ్ రావు.. ముఖ్యమంత్రి పదవి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని వ్యాఖ్యానించటం విశేషం. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను పని చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన హరీశ్.. ముఖ్యమంత్రిని కావాలని.. అధికారాన్ని చెలాయించాలని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. "పని తీరు ఆధారంగానే ప్రజలే పదవులు కట్టబెడతారు. కేటీఆర్ తో మంచి స్నేహం ఉంది. అతడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెబితే.. తప్పకుండా అంగీకరిస్తా. పదవుల కంటే వ్యక్తిత్వమే గొప్పదని భావిస్తా. కాంగ్రెస్ మాదిరి పదవుల కోసం గొడవ పడే కల్చర్ మా పార్టీలో ఉండదు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు.

తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సుపరిపాలన ఇదే తీరులో కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ పవర్ లోకి రావాలన్న హరీశ్.. సీఎం ఎవరైనా తమ పార్టీలో సంక్షేమ పాలన సాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తెలంగాణ పగ్గాలువెళ్లటం మంచిది కాదని.. ఉచిత కరెంట్ ను కాస్తా ఉత్త కరెంట్ గా మార్చిందే కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి పదవి కోసం తానురేసులో లేనన్న విషయాన్ని వెల్లడించటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News