కారు గేరు మారుతోంది... రేవంత్ కు హరీష్ సంచలన సవాల్!
ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
రాజకీయాల్లో చాలా రకాల సవాళ్లు ఉంటాయి కానీ.. అవన్నీ టీవీ ఛానల్స్ లో డిబెట్ల వరకే పరిమితమవుతుంటాయి. ఆ రాత్రి డిబేట్ అయిపోయిన తర్వాత.. ఉదయం మళ్లీ అవి ఎక్కడ కనిపించవు! అయితే... తాజాగా తెలంగాణలో ఒక ఆసక్తికరమైన సవాల్ తెరపైకి వచ్చింది. ఇది కాస్తా సంచలనంగా మారుతుంది. పైగా... రాజీనామా చేసిన తర్వాత తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నా వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు వస్తుండటం.. జనాల్లో బలంగా తిరుగుతుండటం.. టీవీ డిబేట్లకూ హాజరవుతుండటంతో వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. దీంతో... కారు గేరు మార్చినట్లు కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో హరీష్ రావు సంచలన సవాల్ తో తెరపైకి వచ్చారు.
గతకొన్ని రోజులుగా... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ వెంటాడుతున్న హరీష్ రావు.. ఈ విషయంలో ఆ పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని ఫిక్సయినట్లున్నారు! ఇందులో భాగంగా... ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.
అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇందులో భాగంగా... "100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతీ గ్యారెంటీ" అంటూ ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారని చూపెట్టిన ఆయన... 100 కాదు 120 రోజులు దాటిపోయిందనే.. తాము ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలోనే రేవంత్ కు ఒక సవాల్ విసిరారు హరీష్ రావు.
ఇందులో భాగంగా.. "ఎల్లుడు (శుక్రవారం) ఉదయం 10గంటలకు నేను అసెంబ్లీముందున్న గన్ పార్క్ (తెలంగాణ అమరవీరుల స్థూపం) దగ్గరకు వస్తా.. మీరుకూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ, 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తానని రేవంత్ ప్రమాణం చెయ్యి" అని అన్నారు.
ఇదే సమయంలో.. "నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా 6 గ్యారెంటీలూ నిజంగా అమలుచేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. అమలుచేయని పక్షంలో నువ్వు సీఎం పదవికి రాజీనామా చేయాలి. నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం" అంటూ హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు! ఇప్పుడు ఈ సవాల్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.