హైదరాబాద్ లో వర్షం దెబ్బ... విలవిల్లాడిన విశ్వనగరం!

సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ ఊహించని రీతిలో, భారీ స్థాయిలో కురిసిన వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది.

Update: 2023-09-05 18:42 GMT

సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ ఊహించని రీతిలో, భారీ స్థాయిలో కురిసిన వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా కురిసిన ఈ భారీ వర్షానికి భాగ్యనగరం మొత్తం చెరువులను తలపించింది! ఈ సందర్భంగా నగరవాసులు ప్రత్యక్ష నరకాన్ని చూడాల్సి వచ్చింది!

అవును... గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫిలింగర్, కృష్ణానగర్, అమీర్‌ పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌, బోరబండ, షేక్‌ పేట్, రాయదుర్గం, మణికొండ, మెహదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌ పల్లి తో పాటు చాలా ప్రాంతాలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

ఈ సమయంలో నగరవాసులు తాము అనుభవించిన జలనరకానికి సంబంధించిన దృశ్యాలను సెల్ ఫోన్ లలో బంధించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ఎఫెక్టే అని తెలిపింది.

ఇక ఈ భారీవర్షాలకు కొన్ని చోట్ల కరెంట్ లేకపోవడంతో.. మరి కొన్ని చోట్ల వాహనదారుల బైకులు వరదనీటిలో కొట్టుకుపోటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. కొన్ని చోట్ల పిడుగులు ప‌డ‌టంతో భాగ్యనగర ప్రజలు వణికిపోయారు.

ఇలా చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో భాగ్యనగర వాసులు ప్రత్యక్ష నరకం చూశారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేసే పనిలో పడ్డారు. వర్షం వల్ల మరిముఖ్యంగా మృత్యుకూపాలుగా మారుతున్న మ్యాన్ హోల్స్ మరింత ఆందోళనలకు గురి చేశాయి.

అవును... హైదరాబాద్ లో వర్షం పడిందంటే నాలాలు యమద్వారానికి మార్గాలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాన్ హోల్స్ వల్ల ఎన్నో ప్రాణాలు నీటిలో కలిస్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతినగర్ నాలాలో ఉదయం 11 గంటల ప్రాంతంలో గల్లంతైన బాలుడు మిథున్ (4) మృతిచెందాడు. సుమారు ఏడెనిమిది గంటల రెస్క్యూ అనంతరం బాలుడి మృతదేహాన్ని తుర్క చెరువులో గుర్తించారు.

మరోపోక్క భారీ వర్షాల ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో... జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్‌, సిరిసిల్ల, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్‌ వార్నింగ్‌ ఇచ్చారు అధికారులు.

ఇక ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, భువనగిరి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, నారాయణపేట్‌, గద్వాల, మల్కాజ్‌ గిరి, మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.

ఇదే సమయంలో ఏపీలోనూ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ఇవ్వగా... మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇష్యూ అయ్యింది.

Tags:    

Similar News