డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యేగా గెలిచాడు !
కానీ అసలు డిపాజిట్ కూడా దక్కని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలుసా ? ఆశ్చర్య పోవడానికి ఏమీ లేదు.
ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడికి డిపాజిట్ దక్కకుంటే రాజకీయాల్లో ఎంత చులకనగా చూస్తారో అందరికీ తెలిసిందే. కానీ అసలు డిపాజిట్ కూడా దక్కని వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తెలుసా ? ఆశ్చర్య పోవడానికి ఏమీ లేదు. నిజంగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఆంధ్ర రాష్ట్రంలో 1952లో విశాఖపట్నం జిల్లా పరవాడ శాసనసభ నియోజకవర్గంలో ఈ వింత చోటు చేసుకుంది. ఆ ఎన్నికలలో 9 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. ఆ నియోజకవర్గంలో 60,780 ఓటర్లు ఉండగా ఆ ఎన్నికలో 25,511 ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సీపీఐ అభ్యర్థి ముళ్లపూడి వీరభద్రానికి 7,064 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి జగన్నాధ రాజుకు 4347 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఎల్ డీఎ రావుకు 3109 ఓట్లు, కృషికార్ లోక్ పార్టీ అభ్యర్థి ఈటి నాగయ్యకు 1158 ఓట్లు వచ్చాయి.
పోలైన ఓట్ల లెక్కల ప్రకారం ఎన్నికలలో డిపాజిట్ రావాలంటే మూడో వంతు అంటే 8504 ఓట్లు రావాలి. సీపీఐ అభ్యర్థి ముళ్లపూడి వీరభద్రానికి 7,064 ఓట్లు మాత్రమే రావడంతో విజేతను ప్రకటించేందుకు అధికారులు నిరాకరించారు. అయితే ప్రత్యర్థి మీద ఒక్క ఓటు వచ్చినా గెలుపుగా నిర్ధారించాలన్న డిమాండ్ రావడంతో సీపీఐ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ఆ తర్వాత దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 1955లో పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు రావాలని డిపాజిట్ విధానాన్ని మార్చారు.