తొలిసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ లోకి నీళ్లు
భారీ వర్షాలు హైదరాబాద్ కు మామూలే అయినా.. సోమవారం కురిసిన భారీ వర్షానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది.
భారీ వర్షాలు హైదరాబాద్ కు మామూలే అయినా.. సోమవారం కురిసిన భారీ వర్షానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి శంషాబాద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ లోకి వర్షపునీరు రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. కుండపోతగా కురిసిన వానతో హైదరాబాద్ ఆగమాగమైంది. దాదాపు రెండు గంటల పాటు దంచి కొట్టిన వానతో హైదరాబాద్ అతలాకుతలమైంది. ప్రధాన రోడ్లు చెరువులుగా మారిపోయాయి. సోమవారం మధ్యాహ్నం మొదలైన వానతో హైదరాబాదీయులు నానా కష్టాలు పడ్డారు. కుండపోత వర్షంతో వాహనాలు ముందుకు కదలకుండా మొరాయించాయి. పలుచోట్ల కార్లు మునిగిపోతే.. టూవీలర్లు కొట్టుకుపోయాయి.
మధ్యాహ్నం మొదలైన వర్షం.. చూస్తుండగానే పెరిగి పెద్దది కావటమే కాదు.. దాని ధాటికి టోలిచౌకీ, సికింద్రాబాద్, షేక్‌పేట నాలా, యూసు్‌ఫగూడ శ్రీకృష్ణానగర్, ఫిలింనగర్ దీన్‌దయాళ్‌నగర్ ప్రాంతాల్లో వాన నీరు వరదగా మారింది. దీని ఉధృతికి రోడ్ల మీద పార్కు చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి అంటే.. వర్ష తీవ్రత ఎంత భారీగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. కార్ల సగం దాకా మునిగిపోవటం.. అందులో ఉన్న వారిని అతి కష్టమ్మీద బయటకు తీసుకొచ్చిన దుస్థితి.
వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు రోడ్ల మీద నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా ఎప్పటిలానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని రైల్వే కమాన్ అండర్ బ్రిడ్జి వద్దకు భారీగా వరద పోటెత్తటంతో ఒక ఆర్టీసీ బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. దీంతో.. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని టెర్మినల్ లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవటం చూస్తే.. హైదరాబాద్ లో కురిసిన వాన తీవ్రత ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.