ఇప్పుడే రెండో పెళ్లి చేసుకో...ఎంపీకి సీఎం సలహా

ఈ క్రమంలోనే బద్రుద్దీన్ వ్యాఖ్యలకు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-03-31 13:30 GMT

కొందరు రాజకీయ నాయకులు కావాలని కాంట్రవర్సీ కోసం మాట్లాతారో..లేక కనీస అవగాహన లేకుండా మాట్లాడతారో తెలీదుగానీ...తమ వ్యాఖ్యలతో వారు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అసోంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్, ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కూడా ఈ కోవలోకే వస్తారు. నిత్యం తమ మ్యాజిక్ హీలింగ్ ప్రకటనలతో వార్తల్లో నిలిచే బద్రుద్దీన్...తాజాగా 74 ఏళ్ల వయసులో తాను మరో పెళ్లికి రెడీ అంటూ చేసిన ప్రకటన వైరల్ గా మారింది. తాను 'బల్వాన్ అజ్మల్' అని, తనలో బలం ఉందని, మళ్లీ పెళ్లి చేసుకోగలనని ఈ నేత చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ క్రమంలోనే బద్రుద్దీన్ వ్యాఖ్యలకు అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ అజ్మల్ మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే, 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేలోపే చేసుకోవాలని, అప్పుడే దానికి చట్టబద్ధత ఉంటుందని అన్నారు.

అంతేకాదు, తాను కూడా ఆ వివాహానికి హాజరవుతానని చెప్పారు. అయితే, ఎన్నికల తర్వాత అజ్మల్ పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని, ఎందుకంటే అప్పటికి యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమల్లోకి వస్తుందని, అప్పుడు ఆ పెళ్లి చట్టవిరుద్ధం అవుతుందని చురకలంటించారు.

యూసీసీ అమలయ్యాక అజ్మల్ పెళ్లి చేసుకుంటే తదనంతర పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. అజ్మల్ ను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. అజ్మల్‌కు ఒక భార్య ఉన్నారని, యూసీసీ వచ్చాక ఇంకో పెళ్లి చేసుకోకూడదని శర్మ అన్నారు. నన్ను ఇంకో పెళ్లి చేసుకోనివ్వకుండా ఎవరూ ఆపలేరంటూ బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యానించారు. ఇక, అజ్మల్ వ్యాఖ్యలను ధుబ్రి కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ ఖండించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ వ్యాఖ్యలు అజ్మల్ లాంటి వ్యక్తికి శోభనివ్వవని హుస్సేన్ అన్నారు.

Tags:    

Similar News