బాలయ్య చేసిన పాపమేంటి ?

మరి అందరి విషయంలో పనిచేయని ఈ ఫ్యామిలీ ఈక్వేషన్స్ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తేనే పనిచేస్తాయా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.

Update: 2024-12-11 10:30 GMT

ఎన్టీఆర్ సినీ లెగసీని కాపాడుతూ గత అయిదు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణిస్తూ వస్తున్న నందమూరి బాలకృష్ణ రాజకీయంగానూ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు. సినీ రంగంలో ఎవరికీ దక్కని విధంగా వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య హిందూపురాన్ని నందమూరిపురంగా మార్చేశారు.

ఎన్ని పనులు ఉన్నా ఎంతగా షూటింగ్ ఇతరత్రా బిజీగా ఉన్నా కూడా బాలయ్య హిందుపురం ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వస్తున్నారు. వారిని ఆయన ఆదుకుంటూ ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అందుకే ఆయనకు ప్రతీ ఎన్నికకూ మెజారిటీని పెంచుతూ జనాలు కూడా తమదైన తీర్పుతో అభిమాన నీరాజనం అందిస్తున్నారు.

మరి బాలయ్య తండ్రి ఎన్టీఆర్ సీఎం. అన్న హరి క్రిష్ణ మంత్రిగా ఆరు నెలల పాటు చేశారు. సొదరి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా చేశారు. తన వెనక వచ్చిన మేనల్లుడు లోకేష్ మంత్రి అయిపోయారు. ఇక సినీ ఫీల్డ్ లోనూ రాజకీయాల్లోనూ తన వెనక వస్తున్న వారు అంతా మంత్రులుగా కీలక స్థానాలలో ఉంటున్నారు.

మరి బాలయ్య ఏమి పాపం చేశారు అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సమర సింహారెడ్డి నరసింహనాయుడు మూవీస్ శత దినోత్సవ వేడుకలు జరిగినపుడు కాబోయే సీఎం బాలయ్య అని అభిమాన జనం కేరింతలు కొట్టేది. ఆనాడు బాలయ్య ఇమేజ్ అలాంటి రేంజిలో ఉండేది.

ఆయన రావాలే కానీ రాజకీయాల్లోకి సీఎం అయి తీరుతారు అని అభిమానులు బలంగా నమ్మేవారు. తండ్రి స్థాపించిన పార్టీ సిద్ధంగా ఉంది. బాలయ్యకు సినీ క్రేజ్ ఎలాగూ ఉంది. దాంతో ఆయన రాజకీయ ఎంట్రీ ఇస్తే చాలు ముఖ్యమంత్రి కావడం తధ్యమన్న భావనలో ఫ్యాన్స్ ఉండేది. ఇదంతా 2001 నాటి ముచ్చట్లు.

అలాంటిది బాలయ్య 2004, 2009లలో పోటీ చేయలేదు. ఆ రోజులలో టీడీపీ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. 2014లో మాత్రం బాలయ్య పోటీ చేయడమే కాదు గెలిచారు. పార్టీ కూడా విజయం సాధించింది. అపుడు అంతా అన్న మాట ఒక్కటే బాలయ్య కీలక శాఖలకు మంత్రి అవుతారని. కానీ జరిగింది వేరు. అయిదేళ్లు ఆయన ఎమ్మెల్యేగానే ఉండిపోయారు.

కట్ చేస్తే 2019 ఎన్నికలు. వైసీపీ ప్రభజనంలో అంతా ఓటమి పాలు అయినా బాలయ్య గెలిచి సత్తా చాటారు. అయితే విపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇక 2024 లో అయితే టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. బాలయ్యకు ఈసారి బంపర్ ఆఫర్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ మంత్రివర్గంలో ఆయన పేరు లేదు.

అది అభిమానులకు నిరాశనే కలిగించింది. ఇపుడు చూస్తే మంత్రి మండలిలో నాగబాబు కూడా ప్రవేశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉంటూ తన తండ్రి స్థాపించిన పార్టీకి గత నాలుగు దశాబ్దాలుగా అలుపెరకుండా సేవ చేస్తూ వస్తున్న బాలయ్య మంత్రి పదవికి తగడా అన్నదే ఆయన అభిమానుల ఆవేదనగా ఉంది అని అంటున్నారు.

వారూ వీరూ చాలా మంది మంత్రులు అయ్యారు. మరి అన్ని అర్హతలు ఉండి కూడా బాలయ్యకు ఎందుకు మంత్రి పదవి దక్కడంలేదు అన్న ప్రశ్నలు ఉన్నాయి. పోనీ ఫ్యామిలీ ప్యాక్ అని అనుకున్న అందరికీ అలాంటి ప్యాక్ నే అమలు చేస్తున్నారు కదా. ఆ విధంగా చూస్తే నందమూరి కుటుంబానికి మంత్రి పదవి ఏదీ అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎపుడో 1995 ప్రాంతంలో హరిక్రిష్ణ ఆరు నెలల మంత్రి చేశారు. నాటి నుంచి నందమూరి కుటుంబం అధికారానికి దూరంగానే ఉంటూ వస్తోంది అని అంటున్నారు. మరి అందరి విషయంలో పనిచేయని ఈ ఫ్యామిలీ ఈక్వేషన్స్ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తేనే పనిచేస్తాయా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News