హరీశ్ సతీమణి..ఏపీ మీద ఇదేం అక్కసు?

అందుకు భిన్నంగా ఏపీ మీద మాటలు అనటం.. ఆడిపోసుకోవటం.. విషం కక్కటం లాంటివి అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది.

Update: 2023-11-28 04:00 GMT

భర్తకు తగ్గట్లే భార్య అన్న మాటను తూచా తప్పకుండా ఆచరించారు మంత్రి హరీశ్ సతీమణి శ్రీనిత. ఎన్నికల వేళ మాత్రమే బయటకు వస్తూ.. విడి రోజుల్లో వ్యాపారాల్ని చూసుకునే ఆమె తాజాగా తన భర్త హరీశ్ రావు తరపున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఈ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావుకు ఎలాంటి ఇబ్బంది లేకపోగా.. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ విషయంలోనూ పెద్దగా మార్పు ఉండదంటున్నారు. ఒకవేళ.. కాంగ్రెస్ గాలి తీవ్రంగా ఉంటే మాత్రం మెజార్టీ లెక్క కాస్త తేడా వస్తుందే తప్పించి.. మరెలాంటి మార్పు ఉండదంటున్నారు.

ఇంత సేఫ్ గా హరీశ్ స్థానం ఉన్న వేళ.. ఎన్నికల ప్రచారాన్ని అలానే కొనసాగిస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఏపీ మీద మాటలు అనటం.. ఆడిపోసుకోవటం.. విషం కక్కటం లాంటివి అవసరమా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న పక్క రాష్ట్రమైన ఏపీ మాటలు ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సిద్ధిపేటలో జరిపిన ప్రచారంలో భాగంగా తన భర్త హరీశ్ ను మరోసారి గెలిపించాలని అడటంలో ఎలాంటి అభ్యంతరంలేదు.

కానీ.. సమస్య అంతా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు ఎంత గొప్పో అన్న విషయాన్ని చెప్పేందుకు ఏపీ మీద పడిపోవటం.. అవసరం లేని వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఏపీ మీద పడిపోయే హరీశ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన సతీమణి తీరు ఉందని చెుప్పాలి. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని.. కోట్లాడి వారి వద్ద నుంచి గుంజుకున్నట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్న ఆమె.. అన్ని రంగాల్లోనూ దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పుకున్నారు.

ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్న ఆమె.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా.. అభివృద్ది జరగలేదన్న వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను ఒకసారి బేరీజు వేసుకొని చూడాలన్న ఆమె.. "మనం గొప్పనా? వాళ్లు గొప్పనా?" అంటూ ప్రజల్ను ప్రశ్నించటం గమనార్హం. గొప్పలు చెప్పుకోవటం తప్పు కాదు. ఆ పేరుతో పక్క రాష్ట్రాన్ని.. ప్రజల్ని తక్కువ చేసేలా మాట్లాడటమే తప్పన్న విషయాన్ని హరీశ్ సతీమణికి ఏపీ నేతలు కాస్త చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు