'మోడీ ఫాలోవర్లు' సరే.. ప్రశ్నించేవారిదే అసలు రహస్యం!
ఉదాహరణకు.. మణిపూర్ అంశాన్ని తీసుకుంటే.. చాలా మంది ఫాలో వర్లు.. ప్రధానిని ప్రశ్నించారు. కానీ, వారిని మ్యూట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారం మరోసారి ఆసక్తికర చర్చకు దారితీసింది. తాజాగా ఆయన సామాజిక మాధ్యమంలో దూసుకుపోతున్నారని, కోటి మంది(10 మిలియన్లు) ఆయనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారని.. ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. దీనిని సామాజిక మాథ్యమం `ఎక్స్` కూడా ధ్రువీ కరించింది. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తర్వాత.. ఆ ప్లేస్‌ను ప్రధాని మోడీ స్వాధీనం చేసుకున్నారని కూడా పీఎం ఆఫీస్ సంతోషం వ్యక్తం చేసింది.
దీనిపై మోడీ పరివారం.. బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ.. మా నాయకుడు `తోపు` అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సహజంగానే ఇది మంచి రికార్డ్. దీనిని అందరూ హర్షించాల్సిందే. అయితే.. ఇక్కడ ప్రధాన ప్రశ్న.. విమర్శ.. రెండు వున్నాయి. సోషల్ మీడియాను ఎంత మంది ఫాలో అవుతున్నర నేది ఒక రికార్డే అయినా.. ఫాలో అవుతున్న వారు సంధిస్తున్న ప్రశ్నలకు.. అడుగుతున్న సమాచారానికి మోడీ సర్.. ఎంత వరకు జవాబుదారీగా ఉన్నారనేది కీలక అంశం.
ఉదాహరణకు.. మణిపూర్ అంశాన్ని తీసుకుంటే.. చాలా మంది ఫాలో వర్లు.. ప్రధానిని ప్రశ్నించారు. కానీ, వారిని మ్యూట్ చేశారు. మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదు.. అక్కడి అభాగ్యులను ఎందుకు పరామర్శించడం లేదన్న ప్రశ్నకు మోడీ సర్ సమాధానం చెప్పలేదు. పైగా.. ఆ ప్రశ్న అడిగిన వారిని బ్లాక్ చేశారు. ఇక, తాజాగా `రాజ్యాంగ హత్య దినం` అంటూ ఇందిరమ్మ తీసుకువచ్చిన ఎమర్జెన్సీని టార్గెట్ చేసుకుని జూన్ 25ను దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమం చేస్తామన్నారు. దీనిని మోడీ ఎక్స్‌లోనూ పోస్టు చేశారు.
దీనిపై కూడా కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ``అది ప్రకటిత ఎమర్జెన్సీ.. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తోంది. దీనిపై ఏమంటారు`` అన్న ప్రశ్నకు కూడా మోడీ సమాధానం చెప్పలేదు. అంతేకాదు.. గోద్రా దుర్ఘటన జరిగిన రోజును కూడా.. ఒక కార్యక్రమంగా నిర్వహించాలన్న ఓ నెటిజన్ను బ్లాక్ చేసేశారు. అంటే.. మోడీ ఎక్స్ ఖాతాలో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనే లెక్క బాగానే ఉన్నా.. ఎంతమందికి మోడీ సమాధానం చెబుతున్నారనేది కూడా ఇంపార్టెంటే. అప్పుడు భావప్రకటనకు అర్థం ఉంటుంది. కానీ, తమ సోషల్ మీడియా.. ఒక వైపే చూస్తుందన్నట్టుగా మోడీ వ్యవహరించడం.. ఇప్పుడు చర్చకు దారితీసింది.