సినీ స్టార్లు యాంకర్లు ఎవరినీ విడిచిపెట్టం.. డిసిపి వార్నింగ్
ఇక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని క్షమించేది లేదని తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్ హెచ్చరించారు;
ఆన్‌లైన్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఎంతో అలెర్ట్ గా ఉంటుంది. ఇక ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని క్షమించేది లేదని తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్ హెచ్చరించారు. బెట్టింగ్ ఆడేవారిని, బెట్టింగ్ ప్రోత్సహించేవారిని, బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పించే వారిని ఎవరినీ విడిచిపెట్టమని డిసిపి వార్నింగ్ ఇచ్చారు. సినీ, టీవీ తారలు అయినా విడిచిపెట్టేది లేదని అన్నారు.
ఇప్పటివరకూ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పిస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేసామని కూడా వెల్లడించారు. యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించే నటీనటులు, యాంకర్లు బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌లతో సావాసం అంత మంచిది కాదు. సామాజికంగా తీవ్ర కల్లోలానికి కారణమవుతుంది. అందువల్ల ఇలాంటి వాటితో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టమని కఠిన స్వరంతో డిసిపి కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లతో సంబంధం ఉన్నవారిని విచారిస్తున్నాం. ఇంకా ఎందరు ఉన్నా ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెట్టింగ్ యాప్స్ కి ఇంకా ఎవరెవరు ప్రచారం కల్పిస్తున్నారో వారి గురించి ఆరాలు తీస్తున్నామని కూడా డిసిపి వెల్లడించారు. బెట్టింగ్ ఆడిన వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. అయితే ఈ హెచ్చరికతో ఇప్పటికే ఆన్ లైన్ లో పలు వెబ్ సైట్లలో బెట్టింగ్ యాప్ ల ప్రచారంలో కనిపిస్తున్న నటీనటుల్లో ఆందోళన మొదలైంది.