దేశంలో సెకండ్ సిటీగా హైదరాబాద్

రికార్డుల్ని క్రియేట్ చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ.. ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడుతూ.. మిగిలిన మెట్రోపాలిటిన్ సిటీస్ కు ఆసూయ కలిగేలా చేస్తోంది.

Update: 2023-12-29 23:30 GMT

కొన్ని ఘనకీర్తులు విన్నంతనే వావ్ అనేస్తాం. కానీ.. లోతుల్లోకి వెళ్లినప్పుడు నిజమే కదా? అనిపించకమానదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరానికి. దేశంలో మరే మహానగరానికి లేని కొత్త ఇమేజ్ హైదరాబాద్ సొంతమవుతోంది. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ అంతకంతకూ అందరికి నచ్చేస్తోంది. రికార్డుల్ని క్రియేట్ చేస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ.. ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడుతూ.. మిగిలిన మెట్రోపాలిటిన్ సిటీస్ కు ఆసూయ కలిగేలా చేస్తోంది. తాజాగా మరో కీర్తిని సొంతం చేసుకుంది.

దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలకు సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. మొదటి స్థానంలో ముంబయి నిలిచింది. స్థిరాస్తా సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ఒక రిపోర్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆఫర్డబుల్ ఇండెక్స్ లో ఆదాయంలో ఇంటి రుణం నెలవారీ కిస్తీకి చెల్లించే నిష్పత్తి ఆధారంగాఈ రిపోర్టును తయారు చేస్తారు.

దీని ప్రకారం ఈ ఏడాది (2023)లో హైదరాబాద్ మహానగరంలోని ఇళ్ల ధరలు 11 శాతం పెరిగినట్లుగా రిపోర్టు చెబుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఇంటి కొనుగోలుదారులు తమ ఆదాయంలో 51 శాతం వరకు ఈఎంఐకు చెల్లించాల్సి వస్తే.. హైదరాబాద్ లో ఇది 30 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 27 శాతం ఉండగా..గార్డెన్ సిటీ బెంగళూరు 26 శాతంగా ఉంది. చెన్నై 25శాతం.. పుణె 24 శాతం.. కోల్ కతా 24 శాతం.. అహ్మదాబాద్ 21 శాతంగా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

మరి.. రానున్న ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న అంశంపైనా నివేదిక తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెరిగే వ్రద్ధి రేటుతో పాటు ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని అంచనా వేసింది. దీంతో.. ఇళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పింది. కొనుగోలు శక్తి ఎంత పెరిగినా.. ఆకాశమే హద్దుగా మారిన పరిస్థితుల్లో సామాన్యుడి సంగతి తర్వాత.. మధ్యతరగతి వారు సైతం సొంతింటి కలను నెరవేర్చుకోవటం కష్టంగా మారుతోంది. హైదరాబాద్ మహానగర వెలుగు బాగానే ఉన్నా.. ఆ మెరుపుల వెనుక ఉన్న చీకట్లు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు ఒక మోస్తరు జీతాలు ఉన్న వారు సైతం హైదరాబాద్ లో హ్యాపీగా పెరిగేవారు. ఇప్పుడు.. కష్టంగా మారింది. ఇంటి ధర పెరిగితే.. ఆటోమేటిక్ గా ఇళ్ల అద్దెలు కూడా పెరుగుతాయన్నది అసలు సమస్య.

Tags:    

Similar News