ఎల్బీ స్టేడియం.. ఉప్పల్.. హైదరాబాద్ లో మరో క్రికెట్ స్టేడియం.. ఆ దిక్కునే నిర్మాణం

ఉమ్మడి ఏపీ వంటి పెద్ద రాష్ట్రానికి రాజధాని అయినప్పటికీ.. హైదరాబాద్, ఆంధ్రా వంటి రెండు క్రికెట్ సంఘాలు ఉన్నప్పటికీ

Update: 2024-08-02 08:12 GMT

ఉమ్మడి ఏపీ వంటి పెద్ద రాష్ట్రానికి రాజధాని అయినప్పటికీ.. హైదరాబాద్, ఆంధ్రా వంటి రెండు క్రికెట్ సంఘాలు ఉన్నప్పటికీ.. ఓ 20 ఏళ్ల కిందటి వరకు హైదరాబాద్ లో ఉన్నది ఒకే ఒక అంతర్జాతీయ క్రీడా మైదానం. విశాఖపట్నంలోనూ స్టేడియం ఉన్నప్పటికీ దానికి అంతగా ప్రాధాన్యం దక్కలేదు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం (ఎల్బీ స్టేడియం) మాత్రమే కాస్తో కూస్తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేది. అయినా, దీనికి మ్యాచ్ ల కేటాయింపు తక్కువే. అయితే, 2009 తర్వాత మంచి డ్రైనేజీ సిస్టమ్ తో ఉప్పల్ మైదానం అందుబాటులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ కు ఓ మంచి క్రికెట్ స్టేడియం సమకూరినట్లైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ విశాఖపట్టణం స్టేడియం మంచి వసతులతో అంతర్జాతీయ మ్యాచ్ ల నిర్వహణ సామర్థ్యం సంతరించుకుంది.

ఎల్బీ పాయె..

ఉప్పల్ మైదానం అందుబాటులోకి రాకమునుపు.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దశాబ్దాల పాటు సేవలందించింది. నగరం నడిబొడ్డున ఉండడం, భవిష్యత్ లో మ్యాచ్ లు జరిగే సమయంలో ట్రిఫిక్ ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం.. ఉప్పల్ మైదానం నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు ఆడిన ఎల్బీ స్టేడియం ఇతర మ్యాచ్ లు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ వంటి కార్యక్రమం కూడా ఇక్కడే చేపట్టడం గమనార్హం.

మరో స్టేడియం ఎక్కడ?

తాజాగా అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో యూసుఫ్ గూడ, గచ్చిబౌలి, సరూర్ నగర్ స్టేడియాల్లో క్రీడలు తగ్గిన వైనాన్ని ప్రస్తావించారు. ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గి.. రాజకీయ కార్యకలాపాలు పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్త మైదానాన్ని ఎక్కడ నిర్మిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

శంషాబాద్ దిశగానా?

కొత్త క్రికెట్ స్టేడియాన్ని బహుశా శంషాబాద్ దిశగా నిర్మించే ఆలోచన చేయొచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడం సానుకూలతగా మారే అవకాశం ఉంది. అంతేగాక రేవంత్ రెడ్డి కొత్తగా ప్రతిపాదిస్తున్న నాలుగో నగరం కూడా దీనికి సమీపంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కొత్త స్టేడియం శంషాబాద్ దిక్కునే నిర్మాణం అయ్యే చాన్సుంది.

Tags:    

Similar News