హైదరాబాద్‌ యూటీ అవుతుందా?

ఈ నేపథ్యంలో మరొక అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే చాన్సు ఉందని గాసిప్స్‌ వెలువడుతున్నాయి

Update: 2023-09-22 06:08 GMT

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్, జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, ఉమ్మడి పౌరస్మృతి.. ఇలా వివిధ అంశాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటికే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో రెండు సభల్లో ఆమోదం పొందింది.

ఈ నేపథ్యంలో మరొక అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే చాన్సు ఉందని గాసిప్స్‌ వెలువడుతున్నాయి. హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఒక పుకారు బయలుదేరింది. ఇప్పటికే మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే కేంద్రపాలిత ప్రాంతమంటూ ముంబై, కోల్‌ కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఇలా వివిధ నగరాల పేర్లపై గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. వాస్తవానికి దేశ రాజ్యాంగంలోనే దేశానికి రెండో రాజధాని ఉండాలని.. అది దక్షిణ భారతదేశంలో ఉండాలని ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని గతంలోనే డిమాండ్లు వినిపించాయి.

ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను విభజించి తెలంగాణను విడగొట్టాక హైదరాబాద్‌ ను కోల్పోయిన ఆంధ్రులు హైదరాబాద్‌ ను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని డిమాండ్‌ వినిపించారు. కొంతమంది రాజకీయ నేతలు దీనికి స్వరం కలిపారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ ఉండాలని, రెండో రాజధానిగా ఉండటానికి హైదరాబాద్‌ కు అన్ని హంగులు ఉన్నాయన్నారు. దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉందని, అన్ని రాష్ట్రాలకు సమాన దూరంలో ఉందనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే అప్పట్లో తెలంగాణను ఏర్పాటు చేసిన యూపీయే ప్రభుత్వం హైదరాబాద్‌ ను యూటీగా ప్రకటించలేదు. ఇప్పుడు హైదరాబాద్‌ ను యూటీ చేస్తారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. మరోవైపు ముంబై, బెంగళూరు, కోల్‌ కతా, చెన్నై తదితర నగరాల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే దేశంలో అన్ని మెట్రోపాలిటన్‌ నగరాలు (చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌ కతా తదితరాలు)ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తారనే గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఒక్క ముంబై (మహారాష్ట్ర)లో తప్ప మెట్రోపాలిటన్‌ నగరాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ అధికారంలో లేదు. చెన్నై (తమిళనాడు)లో డీఎంకే, కోల్‌ కతా (పశ్చిమ బెంగాల్‌)లో తృణమూల్‌ కాంగ్రెస్, హైదరాబాద్‌ (తెలంగాణ) లో బీఆర్‌ఎస్, బెంగళూరు (కర్ణాటక)లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి.

ఒకవేళ వీటిలో ఏ నగరాన్ని అయినా యూటీని చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తే ఈ ప్రాంతీయ పార్టీలు భారీ నిరసనకు దిగడం ఖాయం. ప్రాంతీయ ఉద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తేనెతుట్టెలాంటి వ్యవహారమైన అయిన ఈ విషయం జోలికి పోదనే గట్టిగా అంతా నమ్ముతున్నారు. అయితే కేంద్రం ప్రస్తుతం సంచలన నిర్ణయాలు తీసుకుంటుండటంతో గాసిప్స్‌ అయితే ఆగడం లేదు. హైదరాబాద్‌ యూటీ అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News