హైడ్రా కన్నెర్ర.. తాజాగా గండిపేటలో ఫామ్ హౌస్ లు నేలమట్టం
ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు సాగగా.. తాజాగా గండిపేట మీద ఫోకస్ చేశారు.
మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్. చెరువుల్ని కబళించి.. ఎఫ్ టీఎల్ పరిధిలో భవనాలు నిర్మితమైతే చాలు.. ప్రొక్లెయిన్లు తీసుకొచ్చి ఎంతటి భవనమైనా.. ఎంతటి పరపతి ఉన్న వారైనా సరే.. నేలమట్టం చేయటమే లక్ష్యంగా దూసుకెళుతోంది హైడ్రా. హైదరాబాద్ డిజిస్టర్ మేనేజ్ మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీరు గడిచిన కొద్ది రోజులుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంతటి పరపతి ఉన్న వారైనప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా చెరువులను కబ్జా చేసి.. కట్టిన నిర్మాణాల్ని కుప్పకూల్చటమే లక్ష్యంగా పని చేస్తోంది.
ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు సాగగా.. తాజాగా గండిపేట మీద ఫోకస్ చేశారు. గండిపేటలోని జంట జలాశయాల్లో నిర్మించిన అక్రమ కట్టడాల (వీటిల్లో ఫాంహౌస్ లు, హోటళ్లు.. హోటల్ రూంలు.. ఫంక్షన్ హాల్.. పిల్లల గేమ్ జోన్ తదితరాలు ఉన్నాయి) మీద హైడ్రా కన్నెర్ర చేసింది. ఆదివారం ఉదయం మొదలైన కూల్చివేతలు రాత్రి వరకు నాన్ స్టాప్ గా సాగుతున్నాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన అతి ముఖ్యమైన అంశం.. ఈ భవనాల యజమానులు సామాన్యులు కారు. రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల కుటుంబాలకు చెందిన బంధువులు.
అయినప్పటికీ.. రూల్ కు భిన్నంగా భవనం ఉంటే చాలు.. వాటిని కూల్చివేయటమే తప్పించి మరో ఆలోచన లేకుండా ముందుకు వెళుతున్నారు. గతంలో అక్రమ నిర్మాణం అంటే.. సదరు కట్టడానికి నాలుగైదు.. పెద్ద రంధ్రాలు పెట్టేసి.. చేతులు దులిపేసుకునేవారు. కానీ.. హైడ్రా అలా చేయట్లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేతల్ని పూర్తిచేశారు. సంపన్నులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఓఆర్వో.. ఎస్ వోఎస్ స్పోర్ట్స్ విలేజీల్లోని 12కు పైగా కట్టడాలతో సహా మొత్తం 50 భవనాల్ని పూర్తిగా కూల్చేశారు. ఈ సందర్భంగా హైడ్రా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజానికి తాజాగా కూల్చివేతలు చేపట్టిన ఫామ్ హౌస్ లను.. ఒక సంస్థ భారీగా వెంచర్ వేసి ప్లాట్లుగా అమ్మేసింది. పలువురు సంపన్నులు వాటిని కొనేసి.. వాటిల్లో ఫామ్ హౌస్ లను నిర్మించారు. అలా నిర్మించిన భవనాలన్ని ఇప్పుడు నేలమట్టం అయ్యాయి. ఇప్పుడు కేవలం డస్టు మాత్రమే మిగిలింది.దీన్ని కూడా హైడ్రానే క్లియర్ చేస్తుందని చెబుతున్నారు. తమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న హైడ్రా మీద పలువురు సీరియస్ అయ్యారు. తమకు అన్ని అనుమతులు ఉన్నట్లుగా పేర్కొంటూ పలు పత్రాల్ని తీసుకొచ్చారు. కొందరు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు ఇచ్చిన నిరభ్యంతర పత్రాల్ని చూపించారు.
అయితే.. హైడ్రా అధికారులు మాత్రం పక్కాగా ప్రిపేర్ అయి వెళ్లటంతో కూల్చివేతల్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. వాటర్ వర్క్స్.. ఇరిగేషన్ విభాగాల సర్వే నివేదికలతో వెళ్లిన అధికారులు.. అక్రమదారులు చూపించిన పత్రాలన్ని నకిలీవిగా గుర్తించారు. అంతేకాదు.. మొయినాబాద్ మండలం అప్పోజీగూడ.. చిలుకూరు.. గండిపేట మండలం ఖానాపూర్ గ్రామాల్లో అప్పటి సర్పంచుల సంతకాలతో తయారైన కొన్ని నకిలీ అనుమతి పత్రాల్ని గుర్తించారు. 2009 తేదీలతో పలువురు మాజీ సర్పంచులు జారీ చేసినట్లుగా ఉన్న పత్రాలు చూపించిన నేపథ్యంలో.. వారిపైనా క్రిమినల్ కేసుల్ని నమోదు చేస్తామని హైడ్రా వార్నింగ్ ఇచ్చింది. గండిపేట ఎఫ్ టీఎల్ లో కట్టడాల తొలగింపు పూర్తి తర్వాత బఫర్ జోన్ మీద ఫోకస్ చేసతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.
తాజా కూల్చివేతల్లో ఖానాపూర్ పోచమ్మ టెంపుల్ వద్ద చేపట్టిన హోటల్ నిర్మాణాన్ని కూల్చేశారు. మరో టీం.. జంట జలాశయాల చెరువు కంచె వద్ద నిర్మించిన గదుల్ని కూల్చేసింది. ఆపై ఖానాపూర్ శివారులోని ఐదు ఎకరాల్లోని ఓఆర్ వో స్పోర్ట్స్ విలేజీలో పది నిర్మాణాల్ని కూల్చేశారు. ఇందులో పన్నెండేళ్ల క్రితం నిర్మించిన ఫంక్షన్ హాల్ తో పాటు.. పిల్లల గేమ్ జోన్.. మరో హోటల్ ఉండట గమనార్హం. గండిపేట ఎఫ్ టీఎల్ లో కట్టడాల తొలగింపు పూర్తి అయ్యాక బఫర్ జోన్ మీద ఫోకస్ చేస్తామని రంగనాథ్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇవ్వటం కూడా నేరమేనని.. అలాంటి అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది.