వండర్‌.. తాను చదువుకున్న సంస్థకు రూ.153 కోట్ల విరాళం!

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాక తాము చదువుకున్న విద్యా సంస్థలను మరిచిపోయేవారే ఎక్కువ

Update: 2023-08-25 06:50 GMT

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాక తాము చదువుకున్న విద్యా సంస్థలను మరిచిపోయేవారే ఎక్కువ. అలాంటిది ఒక వ్యక్తి తాను చదువుకున్న సంస్థను మరిచిపోకుండా భారీ విరాళం ఇచ్చారంటే ఆశ్చర్యపోక తప్పదు. అది కూడా ఏ వందలో, వేలో, లక్షో కాదు.. ఏకంగా రూ.153 కోట్లు ఇచ్చారంటే అద్భుతం కాక మరేమిటి!

ఇందుకు వేదికైంది ఐఐటీ బాంబే. దేశంలోనే ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో ఒకటి.. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)-బాంబే. ఈ విద్యా సంస్థకు తాజాగా పూర్వ విద్యార్థి ఒకరు ఏకంగా రూ.153 కోట్ల (18.6 మిలియన్‌ డాలర్లు)ను విరాళంగా అందించారు. అయితే తన పేరును బహిర్గతం చేయొద్దని చెప్పడంతో విరాళం ఇచ్చిన వ్యక్తి పేరు రహస్యంగా ఉండిపోయింది.

పూర్వ విద్యార్థి ఇచ్చిన ఈ నిధులను గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ సస్టైనబిలిటీ రీసెర్చ్‌ హబ్‌ స్థాపనకు ఉపయోగించాలని భావిస్తున్నామని ఐఐటీ బాంబే తెలిపింది. ఇది ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఇనిస్టిట్యూట్‌ పాత్రను పునర్నిర్వచించగలదని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

కాగా ఈ ఏడాది జూన్‌ లో ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన నందన్‌ నీలేకని కూడా రూ.315 కోట్లు విరాళం అందించారు. నీలేకని విరాళం భారతదేశంలో పూర్వ విద్యార్థి చేసిన అతిపెద్ద విరాళాలలో ఒకటిగా నిలిచి రికార్డు సృష్టించింది.

ఈ నేపథ్యంలో తాజాగా మరో అజ్ఞాత పూర్వ విద్యార్థి అందించిన ఈ కొత్త విరాళం ప్రపంచంలోనే ప్రముఖ టెక్నాలజీ విద్యా సంస్థల్లో ఒకటిగా ఉన్న ఐఐటీ బాంబేను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తోందనే అంచనాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఐఐటీ బాంబే డైరెక్టర్‌ సుభాషిస్‌ చౌధురి ఈ విరాళంపై స్పందించారు. చిన్న సాయం చేసినా దాన్ని గొప్పగా చెప్పుకునే మనుషులున్న ఈ రోజుల్లో ఇంత పెద్ద సాయం చేసి కూడా అజ్ఞాతంగా ఉండాలనుకున్న తమ పూర్వ విద్యార్థిపై ప్రశంసల జల్లు కురిపించారు. పూర్వ విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు. తమ పూర్వ విద్యార్థి అందించిన సాయంతో ప్రపంచ వాతావరణ సంక్షోభానికి వినూత్న పరిష్కారాలు కనుగొంటామని తెలిపారు.

గ్రీన్‌ హబ్‌ ఏర్పాటు చేసి అత్యాధునిక పరిశోధనల ద్వారా వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడం, ఇంటర్‌ డిసిప్లినరీ సహకారాలను ప్రోత్సహించడం చేస్తామని ఐఐటీ బాంబే డైరెక్టర్‌ సుభాషిస్‌ చౌదురి వెల్లడించారు.

కాగా ఇనిస్టిట్యూట్‌ అందించిన సమాచారం ప్రకారం.. ఐఐటీ బాంబే క్యాంపస్‌ లోని అత్యాధునిక అకడమిక్‌ భవనంలో గ్రీన్‌ హబ్‌ ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీలు, సోలార్‌ ఫోటోవోల్టాయిక్స్, బయో ఫ్యూయెల్స్, క్లీన్‌–ఎయిర్‌ సైన్స్, వరద అంచనా, కార్బన్‌ క్యాప్చర్‌తో సహా అనేక కీలకమైన రంగాలలో పరిశోధనను సులభతరం చేస్తుంది.

Tags:    

Similar News