భద్రాచలంలో తీవ్ర విషాదం
అయితే, ఈ భవన నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది.;

భద్రాచలంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని పలువురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వెంటనే స్పందించిన రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ భవన నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది.
ఈ ప్రమాదం వెనుక ఓ అర్చకుడి అత్యాశ, నాసిరకం నిర్మాణం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. "పీఠం" పేరుతో ఒక మఠాన్ని నిర్మించాలని భావించిన సదరు అర్చకుడు, ఒక పాత భవనంపై అదనంగా మరో నాలుగు అంతస్తులను నిర్మిస్తున్నాడు. అమ్మవారి పేరుతో వ్యవహారం నడుపుతున్న ఈ అర్చకుడి చర్యలను గత ఏడాది పంచాయతీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేపడుతున్నారని ప్రశ్నించడంతో అప్పట్లో పనులు నిలిచిపోయాయి. ఆ సమయంలో పంచాయతీ సిబ్బందితో ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లు కూడా సమాచారం ఉంది.
పీఠం పేరుతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన ఈ అర్చకుడు, అమ్మవారి ఆలయాన్ని నిర్మించి దాని పక్కనే ఈ ఆరు అంతస్థుల భవనాన్ని నిర్మించాడు. ఒకవేళ ఈ భవనం ప్రారంభోత్సవం జరిగి భక్తులు ఉండి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు, ఈరోజు పనులు జరుగుతున్న సమయంలో భవనం ఒక్కసారిగా నేలమట్టం కావడంతో విషాదం చోటుచేసుకుంది.
భవనం యజమాని భార్య చెబుతున్న ప్రకారం.., ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు కూలీలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సహాయక సిబ్బంది ప్రొక్లైన్‌ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. పూర్తిగా తొలగించిన తర్వాతే ఎంతమంది ఉన్నారనే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా భద్రాచలం షెడ్యూల్ ప్రాంతం కావడంతో ఇక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు ఉండవని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ చాలా కఠినమైన చట్టాలు అమల్లో ఉంటాయి. అయితే, ఒక అర్చకుడిగా ఉండి కూడా ఆ చట్టాలను ఉల్లంఘించి, భక్తి ముసుగులో పంచాయతీ సిబ్బందిని బెదిరించి నిర్మాణం చేపట్టడం గమనార్హం.
ప్రస్తుతం ఈ అక్రమ నిర్మాణానికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పీఠం పేరుతో అక్రమ నిర్మాణం చేపట్టిన ఈ వ్యక్తిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.