అమెరికాకు ఇంత ఘోర మార్గంలో తీసుకెళ్తారా... వీడియో వైరల్!
తాజాగా హర్యానాకు చెందిన ఆకాశ్ అనే వ్యక్తి పరిస్థితిని చూపిస్తూ కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారూ వీరూ అనే తేడాలేమీలేవు.. అక్కడ అక్రమంగా నివశిస్తున్న విషయం తెలిస్తే రిటన్ ఫ్లైట్ ఎక్కించి స్వదేశానికి పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 104 మంది భారతీయులను తిరిగి పంపించారు.
ఈ సమయంలో వాళ్లందరి కాళ్లకు చైన్లు, చేతులకు సంకెళ్లు వేసి రక్షణ శాఖకు చెందిన విమానంలో భారత్ లోని అమృత్ సర్ కు తీసుకొచ్చి వదిలారు. ఈ సమయంలో అక్కడ నుంచి వెనక్కి వచ్చినవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ కాగా.. తాజాగా హర్యానాకు చెందిన ఆకాశ్ అనే వ్యక్తి పరిస్థితిని చూపిస్తూ కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది.
అవును... అగ్రరాజ్యంపై మోజుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అక్రమంగా వెళ్లే క్రమంలో వారు వెళ్లే మార్గాలు అత్యంత దారుణంగా ఉంటాయని తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. లక్షల రూపాయలు చెల్లించి మరీ వారు పడుతున్న యాతన అత్యంత ఘోరమనే చెప్పాలి.
ఈ క్రమంలో హర్యానాలోని కర్నాల్ కు చెందిన ఆకాశ్ (20) తమకు ఉన్న 2.5 ఎకరాల భూమిని అమ్మి రూ.65 లక్షలతో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్లు మరో రు.7 లక్షలు డిమాండ్ చేయడంతో అదీ చెల్లించాడు. ఈ సమయంలో అతడు అమెరికాకు చేరుకునే మార్గం అత్యంత ఘోరం!
పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరిస్తు.. కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు, అడవిలో చిత్తడి నేలపై నడుచుకుంటూ ఆఖరికి అనుకున్న చోటికి చేరుకున్నాడు. సుమారు 10 నెలల క్రితం భారత్ నుంచి బయలుదేరి జనవరి 26న మెక్సికో సరుహద్దు గోడను దాటి అమెరికాలోకి ప్రవేశించాడు.
అనంతరం అమెరికాలోని చెక్ పాయింట్ వద్ద పోలీసులకు చెక్కాడు. ఈ సమయంలో కొంతకాలం నిర్బంధం తర్వాత ఆకాష్ ను బాండ్ పై విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా బహిష్కరణ పత్రలపై బలవంతంగా సంతకాలు చేయించారు. అలా సంతకం చేయని పక్షంలో అమెరికాలో జైలు శిక్ష పడుతుందని చెప్పారని అంటున్నారు.
ఇలా అక్రమ వలసదారులను అమెరికా నుంచి భారత్ కు పంపేయడంతో ఆకాశ్.. ఈ నెల ఐదున హర్యానాలోని తన ఇంటికి చేరుకున్నాడు.
కాగా... దక్షిణ సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశించడానికి రెండు అక్రమ మార్గాలు ఉన్నాయని చెబుతారు. అందులో ఒకటి నేరుగా మెక్సికో గుండా కాగా.. మరోదాన్ని ‘డంకీ మార్గం’ అని పిలుస్తారు. ఈ క్రమంలో బహుళ దేశాలను దాటుకుంటూ, దట్టమైన అడవులు, నదులు సహా ప్రమాధకరమైన భూభాగాలను నావిగేట్ చేయడం జరుగుతుంది.
ఈ మార్గంలోకి వలసదారులు ప్రవేశించి యూఎస్ చేరుకోవడానికి ముందు టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా వీరంతా రవాణా చేయబడతారని చెబుతున్నారు. అయితే... మెక్సికో మీదుగా నేరుగా వెళ్లడానికి డబ్బు చెల్లించినప్పటికీ ఆకాష్ ను ఈ ప్రమాదకరమైన మార్గంలోనే పంపించారని అతని కుటుంబం ఆరోపిస్తోంది.