పాక్ లో ఇమ్రాన్ 'గెలుపు'.. నేపాల్ లో ప్రచండ 'ఓటమి'

పాకిస్థాన్ మాజీ ప్రధాని.. గడిచిన కొంతకాలంగా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా ఊరట కలిగించే భారీ విజయం లభించింది

Update: 2024-07-13 06:51 GMT

ఒకే రోజున అంతర్జాతీయంగా చోటు చేసుకున్న రెండు పరిణామాలు.. అవి కూడా భారత్ కు అత్యంత దగ్గరగా ఉండే దేశాలు కావటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. అందులో ఒకటి పాకిస్థాన్ మాజీ ప్రధాని వ్యవహారం అయితే.. మరొకటి నేపాల్ ప్రధానికి సంబంధించింది. ఈ రెండు అంశాలు ఆయా దేశాల్లో అత్యంత కీలక పరిణామాలుగా చెప్పాలి. ఒకే రోజున చోటు చేసుకున్న ఈ రెండు కీలక పరిణామాల్ని చూస్తే..

పాకిస్థాన్ మాజీ ప్రధాని.. గడిచిన కొంతకాలంగా జైల్లో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ కు తాజాగా ఊరట కలిగించే భారీ విజయం లభించింది. రిజర్వు సీట్లకు ఆయన పార్టీ (పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్)కి అర్హత ఉందంటూ పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాజీ ఫైజ్ ఈసా ఆధ్వర్యంలోని 13 మంది సభ్యులున్న ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది.

దీంతో.. పార్లమెంటు.. ప్రొవిన్షియల్ అసెంబ్లీలలో ఇమ్రాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీకి రిజర్వు సీట్లు కేటాయించకూడదంటూ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. దీంతో సున్నీ ఇత్తిహాద్ కౌన్సిల్ వేసిన పిటిషన్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారం ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆ దేశ ఎన్నికల కమిషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో మొదలైంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ గుర్తు అయిన బ్యాట్ పై ఎన్నికల కమిషన్ నిషేధాన్ని విధించింది. దీంతో.. ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను ఆయన పార్టీ కోల్పోయింది. దీంతో.. ఇమ్రాన్ మద్దతుదారులు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ‘‘సున్నీ ఇత్తిహా్ కౌన్సిల్’’ పేరుతో ఒక కూటమిగా ఏర్పాడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు వివాదం మొదలైంది.

ఈ కూటమికి పార్లమెంటు.. ప్రొవిన్షియల్ అసెంబ్లీల్లో దామాషా పద్దతిలో రాజకీయ పార్టీలకు విధిగా ఇవ్వాల్సిన రిజర్వుడు సీట్లను ఇవ్వలేదు. దీనికి రిజర్వు సీట్లు పొందే అర్హత లేదని ఆ దేశ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. న్యాయపోరాటానికి దిగారు ఇమ్రాన్ మద్దతుదారులు. తాజాగా అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇమ్రాన్ మద్దతుదారులు రిజర్వుడు సీట్లను సొంతం చేసుకొని పార్లమెంటు.. ప్రొవిన్షియల్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో గడిచిన కొంతకాలంగా అదే పనిగా ఎదురుదెబ్బలు తింటున్న ఇమ్రాన్ కు కాస్తంత ఊరట కలిగించేదిగా చెప్పాలి.

ఇదిలా ఉంటే.. మన ఇరుగున ఉండే మరో చిట్టిదేశం నేపాల్. ఆ దేశ ప్రధానమంత్రి కం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ అధినేతగా వ్యవహరిస్తున్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేత్రత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రపండ ఓటమిపాలయ్యారు. ప్రచండకు 63 ఓట్లు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. దీంతో.. ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

దీంతో ఆ దేశంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ దేశ మాజీ పరధాని కేపీ శర్మ, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవబా సారథ్యంలో కూటమి ప్రభుత్వంగా కొలువు తీరనుంది. ఇందులో కేపీ శర్మ ఓలి పార్టీకి 78 మంది సభ్యులు ఉండగా.. షేర్ బహదూర్ దేవ్ బా పార్టీకి 89 మంది సభ్యుల బలముంది. ఇక.. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా కేపీ శర్మ ఓలి పేర్కొన్నారు. ఈ కూటమిలోని రెండు పార్టీల అధినేతల మధ్య కుదిరిన డీల్ ప్రకారం తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా వ్యవహరిస్తే.. ఆ తర్వాత పార్లమెంట్ గడువు ముగిసే వరకు దేవ్ బా ప్రధానిగా వ్యవహరించనున్నారు.

Tags:    

Similar News