ఆగ‌స్టు 15.. మ‌న‌కే కాదు.. ఈ దేశాల్లోనూ స్వాతంత్ర దినోత్స‌వ‌మే!

కానీ, అంత‌కుముందు రాత్రి(14 అర్ధ‌రాత్రి) అప్ప‌టి దేశ నాయ‌కులు జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి సంబ‌రాలు చేసుకున్నారు.

Update: 2024-08-14 17:41 GMT

ఆగ‌స్టు 15... ఈ పేరు చెప్ప‌గానే ప్ర‌తి భార‌తీయుడి గుండె ఉప్పొంగుతుంది. దీనికి కార‌ణం.. సుదీర్ఘ స‌మ‌రం త‌ర్వాత‌.. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాల‌న‌కు స్వ‌స్థి ప‌లికి.. బ్రిట‌న్ నుంచి భార‌త్ స్వాతంత్రం సొంతం చేసుకుంది. వేలాది మంది పోరాటాల ఫ‌లితంగా భార‌త్‌కు స్వాతంత్రం ల‌భించింది. 1947, ఆగ‌స్టు 14 అర్థ‌రాత్రి భార‌త్‌ను వ‌దిలేసి బ్రిటీష్ పాల‌కులు వెళ్లిపోయారు. తెల్ల‌వారి మ‌న‌కు స్వతంత్రం వ‌చ్చింద‌ని బ్రిట‌న్ అధికారికంగా ప్ర‌క‌టించింది. కానీ, అంత‌కుముందు రాత్రి(14 అర్ధ‌రాత్రి) అప్ప‌టి దేశ నాయ‌కులు జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి సంబ‌రాలు చేసుకున్నారు.

నాటి స్వాతంత్ర‌ పోర‌ట స్ఫూర్తిని కొన‌సాగిస్తూ.. ప్ర‌తి ఏటా ఆగ‌స్టు 15న దేశ‌వ్యాప్తంగా పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను చేసుకుంటున్నాం. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర‌, మండ‌ల‌, గ్రామ స్థాయి వ‌ర‌కు పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం. మొద‌ట్లో కేవ‌లం ప్ర‌భుత్వానికే ప‌రిమిత‌మైన(అంటే ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, పాఠ‌శాల‌లు, కాలేజీల‌కే) ఈ కార్య‌క్ర‌మం.. 2014లో న‌రేంద్ర‌ మోడీ స‌ర్కారు కొలువుదీరిన త‌ర్వాత‌.. `హ‌ర్ ఘ‌ర్ తిరంగా`` నినాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగుర‌వేయాల‌న్న కాన్సెప్టును అమ‌లు చేస్తున్నారు.

అయితే.. ఇది నిర్బంధ‌మేమీ కాదు. భార‌త స్వాతంత్య్ర పోరాటాన్నిమ‌రింత లోతుల్లోకి తీసుకువెళ్లాల‌న్న స‌దుద్దేశంతోనే మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని జోరుగా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి ఇంటిపై మువ్వ‌న్నెల ప‌తాకాన్ని ఎగుర వేసి.. దీంతో సెల్ఫీ తీసుకుని పీఎంవోకు పంపిస్తే స‌ర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఇలా.. ఈ ఏడాది పంద్రాగ‌స్టు ప్ర‌త్యేకత సంత‌రించుకుంది. ఇదిలావుంటే.. ఒక్క మ‌న‌దేశానికే కాకుండా.. ఆగ‌స్టు 15 .. ప‌లు దేశాల్లోనూ స్వాతంత్ర్య దినోత్స‌వంగా జ‌రుపుకొంటున్నారు. ఆయా దేశాల‌కు కూడా.. ఇత‌ర దేశాల నుంచి స్వతంత్రం ల‌భించింది. ఆగ‌స్టు 15నే కావ‌డం గ‌మ‌నార్హం.

+ జ‌పాన్ పాల‌న‌లో ఉన్న కొరియా దేశాలు 1945, ఆగ‌స్టు 15న స్వాతంత్ర్యం పొందాయి. త‌ర్వాత‌.. ఉత్త‌ర కొరియా, ద‌క్షిణ కొరియాగా విడిపోయాయి. దీంతో ఆగ‌స్టు 15నే ఆయా దేశాల్లోనూ స్వాతంత్య్ర దినోత్స‌వం చేసుకుంటున్నారు.

+ బెహ్రెయిన్ దేశం కూడా.. బ్రిటీష్ పాల‌న‌లోనే కొన‌సాగింది. ఈ దేశం కూడా 1800 చివరిలో విజయవంతంగా ముగిసిన బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ఒప్పందం తరువాత బ్రిటన్ పాల‌న‌లోకి వెళ్లిపోయింది. 1971 బహ్రయిన్ స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. 2002లో బహ్రయిన్ సార్వభౌమరాజ్యంగా మారింది. ఇది కూడా ఆగ‌స్టు 15నే ఇండిపెండెన్స్ డే జ‌రుపుకొంటోంది.

+ కాంగో దేశం ఒక‌ప్పుడు ఫ్రాన్స్ అధీనంలో ఉండేది. ఇది గణతంత్ర దేశం. పూర్వపు ఫ్రెంచి పాల‌న‌లో ఉంది. 1960, ఆగ‌స్టు 15న స్వతంత్రం వచ్చిన తరువాత మధ్య కాంగోలోని ఫ్రెంచి ప్రాంతమంతా కాంగో గణతంత్ర రాజ్యంగా మారింది. దీంతో ఇక్క‌డ కూడా ఆగ‌స్టు 15నే స్వ‌తంత్ర దినోత్స‌వం చేస్తారు.

+ లీచెన్ స్టైన్ దేశం జ‌ర్మ‌నీ పాల‌న‌లో ఉండేది. కేవలం 160 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. లీచ్టెన్‌స్టీన్ ఐరోపాలో నాల్గవ అతి చిన్నదేశం. త‌ర్వాత ఇది స్వతంత్ర దేశంగా మారింది. ఇక్క‌డ కూడా ఆగ‌స్టు 15నే ఇండిపెండెన్స్ డే నిర్వ‌హిస్తారు.

Tags:    

Similar News