కెనడా పొగరుకు పెద్ద మందు వేయాల్సిందే
ఇలాంటప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది కదా? అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణి సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.
తమ దేశ భద్రతకు.. సార్వభౌమాధికారానికి.. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఎదుటోడు ఎవడన్న విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి విషయంలో ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాలు అస్సలు ఉపేక్షించవు. చివరకు చిన్న దేశాలు సైతం ఎగిరెగిరి పడుతుంటాయి. ఇలాంటప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది కదా? అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ధోరణి సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.
తప్పు చేయకున్నా.. తప్పు చేసినట్లుగా బిల్డప్ లు ఉన్న కెనడాకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఉంది. అసలు బారత్ ను ముక్కలు చేయాలన్న నినాదంతో ఉండే సంస్థల విషయంలో కెనడా ఎందుకు చర్యలు తీసుకోదు? ఇలాంటి తీరును ముందు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. భారత సార్వభౌమాధికారానికి సవాలుగా మారుతున్న ఇలాంటి శక్తుల విషయంలో దూకుడుగా ఎందుకు వ్యవహరించకూడదు?
ఇప్పటికే ఖలిస్థానీ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్న కెనడా తీరును అంతర్జాతీయంగా ఎందుకు ప్రశ్నించకూడదు. ఇలాంటి శక్తులను ఎందుకు ఆదరించాలి? భారత్ పాత్ర లేకున్నా ఖలిస్థానీ నేత నిజ్జర్ ను ఎవరో హత్య చేస్తే దానని భారత్ ఖాతాలో వేయటం.. దౌత్య సిబ్బందిపై నేరారోపణ చేయటం.. వారిపై చర్యలు తీసుకునే షాకింగ్ చర్యలకు తెర తీయటం లాంటి పనులు చేపట్టిన కెనడా.. ఇటీవల దేశ హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
కెనడా మంత్రి ఒకరు కేంద్ర మంత్రి అమిత్ షాపై అసంబద్ధ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిని భారత్ తీవ్రంగా ఖండించటమే కాదు.. కెనడా హైకమిషనర్ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. కెనడా అధికారికి సమన్లు జారీ చేశారు. అయితే.. ఈ చర్యలు కెనడా లాంటి మొద్దు శరీరం ఉన్న ట్రూడో ప్రభుత్వాన్ని కదిలిస్తుందా? అన్నది ప్రశ్న. ఒక ప్రజాస్వామ్య దేశానికి చెందిన హోం మంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేసే వేళ.. ఆధారాల్లేకుండా మాట్లాడటానికి మించిన దుర్మార్గం ఏముంటుంది? ఇప్పటికే పలుమార్లు లక్ష్మణ రేఖ దాటుతున్న కెనడాకు ముకుతాడు వేయాల్సింది. గతంలో మాదిరి కాదని.. ఏమన్నా చూస్తూ ఊరుకునే ధోరణి భారత్ కు లేదన్న విషయంతో పాటు.. దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీసే ఎలాంటి చర్యలకైనా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని కెనడాకుఅర్థమయ్యేలా చెప్పటం చాలా అవసరమని చెప్పాలి. మరి.. మోడీ సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.