విచారణ వేళ ఆధారాల్లేవన్న ట్రూడో వ్యాఖ్యలపై భారత్ కీలక వ్యాఖ్య!

రాజకీయ ప్రయోజనాల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడితే జరిగే నష్టం కెనడా ప్రధానికి అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు నెలకొంది.

Update: 2024-10-17 05:30 GMT

రాజకీయ ప్రయోజనాల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడితే జరిగే నష్టం కెనడా ప్రధానికి అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. భారత్ మీద అవసరం లేని ద్వేషాన్ని.. రాజకీయ ప్రయోజనాల కోసం వండి వార్చిన ఆయనకు ఇప్పుడు ఇబ్బందులు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా జరిగిన విచారణకు హాజరైన ఆయన.. భారత్ మీద తాము చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవంటూ నాలుక మడతేయటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.

గత ఏడాది ఖలిస్థానీ అనుకూల వాది నిజ్జర్ కెనడాలో హతం కావటం తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందన్నది ట్రూడో ఆరోపణ. అయితే.. తాము చేసిన ఆరోపణలకు సంబంధించి తమ వద్ద కేవలం సమాచారం ఉన్నదే తప్పించి.. అందుకుసంబంధించిన పక్కా ఆధారాల్లేవన్న విషయాన్ని పేర్కొనటం తెలిసిందే. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. కెనడా ప్రధాని తీరును తప్పు పట్టింది.

నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేం ఎంతో కాలం నుంచి ఇదే చెబుతున్నామని.. అదే అంశం ఈ రోజు రుజువైందని పేర్కొన్నారు. ‘‘మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతు ఇచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాల్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత తీవ్రస్థాయిలో దిగజారటానికి కెనడా ప్రధాని ట్రూడోనే పూర్తి బాధ్యుడు’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రూడో వ్యాఖ్యలపై ఏ మాతరం ఆలస్యం చేయకుండా విదేశాంగ విడుదల చేసిన ప్రకటన ట్రూడో అసలు తీరు బట్టబయలు అయ్యేలా చేసిందని చెప్పాలి.

Tags:    

Similar News