భారత్ - కెనడా బంధం పూర్తిగా చెడినట్లేనా?...అసలేం జరిగింది?

ట్రూడో సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలతో భారత్ - కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయనే చర్చ తెరపైకి వచ్చింది.

Update: 2024-10-15 03:47 GMT

ట్రూడో సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాలతో భారత్ - కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం.. సోమవారం చోటు చేసుకున్న కీలక పరిణామాలే. ఈ నేపథ్యంలో కెనడా చేసిన పనికి ఢిల్లీ సీరియస్ అయ్యింది.. కెనడా వ్యవహారశైలిని పూర్తిగా తప్పుబట్టింది.

అవును... కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్ తో సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను "పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్" (అనుమానితులు)గా కెనడా పేర్కొంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

ఇదే సమయంలో... కెనడాలోని తన హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో... మరింత సీరియస్ గా రియాక్ట్ అయిన ఢిల్లీ... తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ట్రూడో సర్కార్ పై తమకు విశ్వాసం లేదని స్పష్టం చేసింది.

వాస్తవానికి 2023లో కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసినప్పటి నుంచీ వాటికి సంబంధించిన వివరాలు వెళ్లడించలేదు. ఈ సమయంలో ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను భారత్ తో పంచుకోవాలని విదేశాంగ శాఖ పలుమార్లు అభ్యర్థించింది. అయినప్పటికీ... ట్రూడో సర్కార్ లో చలనం రాలేదు. దీంతో.. ఆధారాలు లేకుండా ఆరోపణలు ఏమిటని భారత్ ఆగ్రహం వక్తం చేసింది.

ఇదే క్రమంలో... 2018 నుంచే ఆ దేశ ప్రధాని ట్రూడో భారత్ తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆయన వైఖరికి అద్దం పట్టే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇందులో భాగంగా... భారత్ తో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారిని ఆయన తన మంత్రివర్గంలో చేర్చుకొన్న విషయాన్ని గుర్తుచేసింది.

దీనికి తోడు 2020లో భారతదేశ రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకొవడానికి ట్రూడో ప్రయత్నించారని తెలిపీంది. ఇదే సమయంలో... కెనడా ఆరోపణలు చేస్తున్న.. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ల దౌత్య అనుభవం ఉందని భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందిస్తూ.. వెల్లడించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించాలని భారత్ నిర్ణయం తీసుకుంది. వారంతా ఈ నెల 19వ తేదీ రాత్రి 11:59 గంటల్లోగా భారత్ ను వీడాలని ఈ మేరకు గడువు విధించింది. దీంతో... కెనడా కూడా ఆరుగురు భారత దౌత్యాధికారుల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు!

మరోపక్క లావోస్ లో జరుగుతున్న 21వ ఆసియన్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోడీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయినట్లు కథనాలొచ్చాయి! అయితే.. ఆ సమావేశాల్లో వీరిరువూ ఎదురుపడ్డారే తప్ప.. వీరిమధ్య ఎటువంటి చర్చలూ జరగలేదని భారత్ స్పష్టం చేసింది.


ఎవరీ సంజయ్ కుమార్ వర్మ?:

1998 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్.) అధికారి సంజయ్ కుమార్ వర్మ. ఈయన పాట్నా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అనంతరం ఐఐటీ ఢిల్లీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. ఇక ఐ.ఎఫ్.ఎస్.లో అడుగుపెట్టిన తర్వాత.. హాంకాంగ్, వియాత్నాం, చైనా, తిర్కియే, ఇటలీ దేశాల్లో దౌత్య సేవలు అందించారు.

తర్వాత భారత విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే 2022 సెప్టెంబర్ లో కెనడాలోని భారత హైకమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇలా దౌత్యపరంగా మూడు దశాబ్ధాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. అయితే తాజాగా కెనడా ప్రభుత్వం నుంచి ఆధారాలు లేని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు!

కాగా... గత ఏడాది జూన్ లో ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. దీంతో... ఈ వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి.

Tags:    

Similar News