యూఎస్ లో భారత వలసదారులకు సంకెళ్లు... కేంద్రం క్లారిటీ ఇదే!

ఈ సమయంలో వారి కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి ఉన్నట్లు పలు ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి!

Update: 2025-02-06 05:34 GMT

అమెరికాలో అక్రమంగా నివస్తిస్తున్న విదేశీయులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. తన ప్రమాణస్వీకారం అనంతరం అక్రమ వలసదారులకు అమెరికాలో అవకాశం లేకుండా చేస్తున్నారు! ఈ సమయంలో.. భారతీయులను వెనక్కి పంపినప్పుడు వారికి సంకెళ్లు వేశారంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

అవును.. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ట్రంప్ సర్కార్ మిలటరీ విమానంలో బుధవారం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలివిడతలో భాగంగా... 104 మంది భారతీయులను అమృత్ సర్ కు పంపించింది. ఈ సమయంలో వారి కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి ఉన్నట్లు పలు ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి!

దీంతో... ఈ ఫోటోలు వైరల్ కావడంతో పాటు, పెను రాజకీయ దుమారాన్ని లేపాయి. భారతీయుల కాళ్లకు గొలుసులు, చేతికి సంకెళ్లు ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ నేతలు! ఈ సందర్భంగా.. వారిని నేరస్థులుగా ట్రీట్ చేస్తూ పంపించడం అవమానకారమని, ఓ భారతీయుడిగా తాను ఇవి చూడలేకపోతున్నానని పవర్ ఖేడా ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ ఫోటోలు పెను దుమారం రేపడంతో ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్ మెంట్ ఆ ఫోటోలపై నిజ నిర్ధారణ ప్రక్రియ చేపట్టింది. ఈ సందర్భంగా... అవి భారతీయుల ఫోటోలు అనే ప్రచారం ఫేక్ అని తేలినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.

ఈ సందర్భంగా... భారత వలసదారులను సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న దృశ్యాలు నకిలీవని.. ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కాదని.. వాస్తవానికి అవి అమెరికాలో ఉన్న కొంతమంది అక్రమ వలసదారులను గ్వాటెమాలాకు పంపిస్తున్నప్పటి ఫోటోలని రాసుకొచ్చింది. దీంతో... ఈ దుమారానికి బ్రేక్ పడినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... 104 మంది అక్రమ వలసదారులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి-017.. బుధవారం మధ్యాహ్నం 1:55 గంటలకు అమృత్ సర్ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చినవారిలో 33 మంది హర్యానా, 33 మంది గుజరాత్, 30 మంది పంజాబ్ వాసులతో పాటు ముగ్గురు యూపీ, ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరు చండీగఢ్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News