కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పద్మ ‘స్త్రీల’ ఘనతలు.. ప్రత్యేకతలివే
ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డుల్లో ఈసారీ భారత మహిళలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కళలు, సేవ, ఆధ్యాత్మికం, బ్యాంకింగ్.. ఇలా భిన్న రంగాలకు చెందిన వారిని పద్మాలుగా ఎంపిక చేసింది కేంద్రం.
ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డుల్లో ఈసారీ భారత మహిళలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కళలు, సేవ, ఆధ్యాత్మికం, బ్యాంకింగ్.. ఇలా భిన్న రంగాలకు చెందిన వారిని పద్మాలుగా ఎంపిక చేసింది కేంద్రం. వారి ప్రత్యేకతలు తెలుసుకుంటే ఔరా అనిపించక మానదు. మహిళా జాతికి స్ఫూర్తిగా నిలిచే వీరంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ ఆశలను ఆశయాలను నెరవేర్చుకున్నారు.
ఒడిసా రాష్ట్ర ప్రత్యేకత అయిన కథక్ నృత్యంలో విశేష పేరు సంపాదించారు కుముదినీ రజనీకాంత్ లాఖియా. ఈమె పుట్టింది ముంబై. ఏడేళ్ల వయసులో నృత్య సాధన ప్రారంభించారు. భరత నాట్యం, బ్యాలే, స్పానిష్ డ్యాన్స్ వంటివెన్నో ప్రయత్నించారు. సంగీతమూ నేర్చుకున్నారు. చివరగా కథక్ లో కొనసాగారు. 17 ఏళ్లకే దేశవిదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. పెళ్లయ్యాక అహ్మదాబాద్ లో స్థిరపడ్డారు. కథక్ నేర్పే టీచర్ గా మారాలనుకుంటే గుజరాత్ లో దానిని తెలిసిన వారే లేరు. ఈ నాట్యాన్ని వేశ్యలు చేసే నృత్యం అని భావించేవారట. కానీ, కుముదిని కథక్ గొప్పదనం గురించి చెబుతూ.. ఒక్కొరినీ చేర్చుకుని వారికి నేర్పించారు. 60 ఏళ్ల కిందటే అంటే 1964లో ‘కదంబ్’ పేరుతో డ్యాన్స్ అకాడమీ ప్రారంభించారు. కొరియోగ్రఫీనీ ప్రారంభించి 80 దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ఇప్పుడు కుముదినికి 94 ఏళ్లు. ఇప్పటికీ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. భారత్, అమెరికా, యూరప్ ఖండంలోని విశ్వవిద్యాలయాల్లో నృత్య రూపకాలపై బోధిస్తున్నారు. ఈమెను కేంద్రం పద్మవిభూషణ్ తో సత్కరించింది.
సాధ్వి రుతంభర.. హిందూవాద ప్రచారకురాలు. తన వాగ్ధాటితో కట్టిపడేసే ఆధ్యాత్మిక గురువు. సామాజిక సేవతో ‘దీదీమా’గా పేరొందారు. తాజాగా కేంద్రం ఆమెను పద్మభూషణ్ తో గౌరవించింది. సాధ్వి రుతంభర పంజాబ్ లూథియానాలోని మండి దోరహాలో పుట్టారు. ఈమె తొలి పేరు నిషా. పదహారేళ్ల వయసులో హరిద్వార్ సాధువు స్వామీ పరమానంద గిరి ఆధ్యాత్మిక భావజాలానికి ప్రభావితమై గురువుగా స్వీకరించారు. తర్వాత సాధ్విగా మారారు. వీహెచ్ పీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆరంభించారు. వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని స్థాపకురాలు ఈమెనే. అయోధ్య రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నారు. పరమ్ శక్తిపీఠ్ సామాజిక సంస్థ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో భక్తిభావాన్ని పెంచడంతోపాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యలనూ నేర్పుతారు. ఇందౌర్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లలో అనాథ పిల్లలు, మహిళలు, వితంతువుల కోసం ఆశ్రమాలను నడుపుతున్నారు. వందల మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. తన నివాసం బృందావనంలో పేద పిల్లలు, వృద్ధ మహిళలకు ‘వాత్సల్య గ్రామ్’ ఏర్పాటుచేశారు.
భజనలు, జానపదాలు, రాజస్థానీ సంప్రదాయ మండప్‌లను ఆలపిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు బతూల్ బేగం. ఈమెకు పద్మశ్రీ అవార్డు దక్కింది. రాజస్థాన్ లోని దివానా జిల్లా కేరప్ ఈమె సొంతూరు. ప్రస్తుతం జైపూర్ లో ఉంటున్నారు. ఉత్తరాదిలో కనిపించే జానపదాలు పాడే మిరాసీ సమాజానికి చెందినవారు. పాఠశాలకు వెళ్లే దారిలో ఠాకూర్ జీ (శ్రీకృష్ణ) ఆలయంలో భజనలు విని విని అలవాటైంది. పెళ్లిళ్లు, పండుగల సమయంలో పాడుకునే మండప్ శైలి పాటలూ, జానపదాలనూ నేర్చుకున్నారు. ఆపై మండప్ విభాగంలో గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజస్థానీ జానపదాలకు జీవం పోస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో తన బృందం ‘బసంత్’ తో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
కర్ణాటకలోని కొప్పళ్ల జిల్లాకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ దొడ్డబల్లప్ప సిలేక్యాతార తోలుబొమ్మలాట కళలో అందించిన సేవలకు పద్మశ్రీ అందుకున్నారు. నిరక్షరాస్యురాలైన భీమవ్వను ‘గ్రాండ్ మదర్ ఆఫ్ గొంబెయాట’ అంటారు. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన కళపైన ఆసక్తి పెంచుకుని 14వ ఏట నుంచి నేర్చుకున్నారామె. 70 ఏళ్లుగా రామాయణ, మహాభారతాలను బొమ్మలాటల ద్వారా ప్రచారం చేస్తున్నారు. 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.
ఎస్‌బీఐ మాజీ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య గొప్ప బ్యాంకర్. ఆ బ్యాంక్ ను వదిలి ‘సేల్స్ ఫోర్స్’లో చేరడం సంచలనం రేపింది. అయినా దీనిని సవాల్ గా తీసుకుని పోరాడారు. అరుంధతి వాళ్లది కోల్‌కతా. సాధారణ విద్యార్థిని. ఇంగ్లిష్ లిటరేచర్ చదివిన ఆమె ఎవరో చెబితే 22ఏళ్ల వయసులో ఎస్‌బీఐ ఉద్యోగానికి ప్రయత్నించారు. చైర్ పర్సన్ స్థాయికి ఎదిగారు. ఇదే శ్రమతో సేల్స్ ఫోర్స్ నూ పరుగులు పెట్టించారు. అరుంధతి చేరేప్పటికీ దీని ఉద్యోగులు 2.5 వేలు. ఇప్పుడు 13 వేలు. టర్నోవర్ రూ.9 వేల కోట్లు. అందుకే పద్మశ్రీకి ఎంపికయ్యారు.
ప్రముఖ సంగీత దర్శకుడు పండిట్ రవిశంకర్ మేనకోడలు మమతా శంకర్.. గొప్ప నృత్యకారులైన ఉదయ్ శంకర్, అమలా శంకర్‌ల బిడ్డ. వారసత్వాన్ని అందుకున్న ఆమె చిన్నతనంలోనే నాట్యంలో అరంగేట్రం చేశారు. ప్రముఖ దర్శకులు మృణాల్ సేన్ బెంగాలీ చిత్రం ‘మృగయా’, సత్యజిత్‌రే ‘ఘనశత్రు’, బుద్ధదేవ్ దాస్ గుప్తా, గౌతమ్ ఘోష్, రితుపర్ణోఘోష్ సినిమాలతో గుర్తింపు పొందారు. ఉదయన్ మమతా శంకర్ డ్యాన్స్ కంపెనీ, మమతా శంకర్ బ్యాలే ట్రూప్ లను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలెన్నో ఇచ్చారు. ఇవన్నీ పద్మశ్రీ దక్కేలా చేశాయి.
ఆల్ ఇండియా రేడియో మాజీ ఉద్యోగి లిబియా లోబో సర్దేశాయ్ ది గోవా. 1950ల్లో పోర్చుగీసుల ఆధీనంలోని ఈ ప్రాంతానికి విముక్తి కల్పించాలనుకున్నారు. దీంతో అడవిబాట పట్టారు. ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ పేరుతో భూగర్భ రేడియో ప్రారంభించారు. వామన్ సర్దేశాయ్ తో కలిసి పోర్చుగీసు, కొంకణి భాషల్లో స్వాతంత్య్రం కోసం భారత్ అహింసా మార్గంలో పోరాడిన తీరును వినిపించేవారు. రోజుకు 18 గంటలు సమాచార సేకరణ, స్క్రిప్ట్ రాయడం, రేడియోలో వినిపించడం, పాంప్లెట్లు రాసి పంచడంలోనే గడిపేవారు. ఏళ్లపాటు దీనిని కొనసాగించారు. దీంతో పోర్చుగీసు ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. స్వాతంత్య్రం లభించిందన్న సమాచారం అందాక పోర్చుగీసు దళాలు పేల్చేసే ప్రమాదం ఉందని తెలిసినా విమానం ఎక్కి గోవా అంతటా చక్కర్లు కొట్టారు లిబియా. ఇప్పుడు వందేళ్ల వయసులో ‘పద్మశ్రీ’ అందుకున్నారు.
కలబురగికి చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణురాలు. 70 ఏళ్ల విజయలక్ష్మి నాలుగు దశాబ్దాల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఈమె చదువుకునేందుకు కష్టాలను ఎదుర్కొన్నారు. తండ్రి ఒక మిల్లు కార్మికుడు. తల్లి కూరగాయల దుకాణం నడిపేవారు. ఎనిమిది మంది సంతానంలో విజయలక్ష్మి పెద్ద. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ప్రోత్సాహంతో పిల్లలంతా చదువుకున్నారు. కూరగాయల దుకాణం నడపడంలో తల్లికి సాయపడేవారు. కర్ణాటక మెడికల్ కాలేజీ- హుబ్బళ్లి నుంచి 1980లో ఎంబీబీఎస్ పూర్తిచేశారు విజయలక్ష్మి. కూతురిని డాక్టర్ చేయడానికి ఈమె తల్లి మంగళసూత్రాన్ని సైతం అమ్మేశారు. బళ్లారిలో ఎంఎస్ పూర్తిచేశారు. సర్జికల్ ఆంకాలజీలో పైచదువుల కోసం ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్, బెంగళూరులోని కిద్వాయి హాస్పిటల్‌లో పనిచేశారు. రొమ్ము క్యాన్సర్ నిపుణురాలిగా రాణించారు. రిటైరయ్యాక 2014లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బెంగళూరులో ‘అబలాశ్రమం’ అనే బాలికల హోమ్ కు చీఫ్ గా ఉన్నారు.
18 ఏళ్లకే ఉద్యమబాట... 21ఏళ్లకే జైలుకి వెళ్లడం... సర్వోదయ భూదాన్, చిప్కో, మద్యపాన వ్యతిరేకం లాంటి ఎన్నో ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు రాధా బెహన్ భట్ ఇప్పడు 91 ఏళ్ల వయసులోనూ గుజరాత్ గాంధీ ఆశ్రమంలో సేవలందిస్తున్నారు. ఈమెకు పద్మశ్రీ దక్కింది. రాధ స్వస్థలం ఉత్తరాఖండ్ అల్మోరా.
40 ఏళ్లుగా రచనలతో విశిష్ట స్థానం పొందిన ప్రతిభా శతపథి ప్రముఖ ఒడియా రచయిత్రి, విద్యావేత్త. సామాజిక సమస్యలను, వ్యక్తిగత భావోద్వేగాలను, మహిళల జీవితంలోని విభిన్న కోణాలనూ స్పృశిస్తూ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు.
లక్నో డాక్టర్ సోనియా నిత్యానంద్ కింగ్ జార్జ్ మెడికల్ కళాశాలలో (కెజీఎమ్‌సీ) హెమటాలజీ విభాగం వైస్ చాన్స్ లర్. దేశంలోని అతికొద్ది మంది బోన్ మ్యారో స్పెషలిస్ట్ లలో ఈ మె ఒకరు. 25 బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను చేశారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు గురవుతున్న భారత మహిళల సంఖ్య పెరుగుతోంది. డాక్టర్ నీరజా భట్లా ఈ క్యాన్సర్ నివారణకు చవకైన, సులువైన పద్ధతులను కనిపెట్టాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆమె ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజీ నిపుణురాలు. ఢిల్లీ ఎయిమ్స్ మెటర్నిటీ అండ్ గైనకాలజీ చీఫ్. తన సేవలకు గుర్తింపుగా నీరజకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది