లిస్టులోకి మరో దేశం: భారతీయులకు వీసా అక్కర్లేదు

ఇరాన్ కు రావాలంటే భారత్ తో పాటు మరికొన్ని దేశాలకు వీసాతో పని లేకుండా వచ్చేయొచ్చని పేర్కొంది.

Update: 2023-12-16 04:29 GMT

ఇటీవల కాలంలో వీసా అవసరం లేకుండా తమ దేశాలకు భారతీయుల్ని ఆహ్వానిస్తున్న దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆ జాబితాలో మరో దేశం చేరింది. ఆ దేశమే.. ఇరాన్.మొన్నటికి మొన్న మలేషియా.. శ్రీలంక.. వియత్నాం దేశాలు భారతీయులతో పాటు కొన్ని దేశాలకు చెందిన వారిని తమ దేశానికి వీసా లేకుండా రావొచ్చని చెప్పటం తెలిసిందే.

తాజాగా ఇరాన్ ప్రభుత్వం ఈతరహా నిర్ణయాన్ని తీసుకుంది. ఇరాన్ కు రావాలంటే భారత్ తో పాటు మరికొన్ని దేశాలకు వీసాతో పని లేకుండా వచ్చేయొచ్చని పేర్కొంది. విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు.. సందర్శకులు తమ దేశానికి ఎక్కువగా వచ్చేందుకు వీలుగా ఇరాన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.తమ దేశంపై పశ్చిమ దేశాలు చేసే దుష్ప్రచారానికి చెక్ చెప్పే క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

భారతదేశంతో పాటు మరో 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులు ఇస్తున్నట్లుగా ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టొచ్చన్న మాట ఆ దేశ విదేశాంగ మంత్రి నోటి నుంచి రావటం గమనార్హం. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్ తో పాటు రష్యా.. యూఏఈ.. బహ్రెయిన్.. సౌదీ.. ఖతార్.. కువైట్.. లెబనాన్.. ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు ఉన్నాయి.

మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో ఇరాన్ ను సందర్శించే విదేశీయుల సంఖ్య ఎక్కువ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. మొదటి 8నెలల్లో 44 లక్షల మంది విదేశీయులు తమ దేశాన్ని పర్యటించారని.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 48.5 శాతం ఎక్కువగా పేర్కొంది. సో.. ఇరాన్ చూడాలనుకుంటే.. వెంటనే ప్లాన్ చేసేయొచ్చు.

Tags:    

Similar News