గోవధ వల్లే ఇందిర, రాజీవ్‌ హత్యకు గురయ్యారు!

గోవధ వల్లే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Update: 2024-01-14 04:30 GMT

దేశంలో వివాదాస్పద వ్యాఖ్యలను చేయడం, వార్తల్లోకెక్కడం బీజేపీ నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత కుమార్‌ హెగ్గే వివాదాస్పద వ్యాఖ్యలతో కాకరేపారు. గోవధ వల్లే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారని హాట్‌ కామెంట్స్‌ చేశారు.

గోవధ నిషేధ చట్టాన్ని తొలగించాకే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తమిళనాడులోని పెరంబదూరులో ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌ గాంధీ హత్య చేయబడ్డారని గుర్తు చేశారు. ఈ మేరకు కర్ణాటకలోని కుమటలో ఒక కార్యక్రమంలో అనంత్‌ కుమార్‌ హెగ్డే ప్రసంగించారు.

అయోధ్యలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసినట్లే.. కర్ణాటకలోని భట్కళలోని బంగారుపళ్లిలోనూ కొన్ని ఘటనలు జరుగుతాయని అనంత్‌ కుమార్‌ హెచ్చరించారు. కావాలంటే దీన్ని బెదిరింపు అని కూడా అనుకోవచ్చన్నారు. సిరసి సీపీ బజార్‌ లో ఇప్పుడు ఉన్న మసీదు ఒకప్పుడు విజయ విఠల దేవాలయమని వెల్లడించారు. ఈ విషయం చరిత్ర పుస్తకాల్లోనూ ఉందన్నారు. అదేవిధంగా శ్రీరంగపట్టణలోని పెద్ద మసీదు ఒకప్పుడు ఆంజనేయ స్వామి ఆలయమని స్పష్టం చేశారు. ఇప్పటికీ అక్కడకు వెళ్లి చూస్తే ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయని తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటి వ్యక్తులు హిందూ సమాజంలో చీలికలు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అనంత కుమార్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీకి మాత్రమే వ్యతిరేకం కాదని, కోట్లాది మంది హిందువులకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు. అల్పసంఖ్యాకుల ఓట్ల కోసం సిద్ధరామయ్య అహిందను తెరపైకి తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి వెళ్లనని సిద్ధరామయ్య మొదట చెప్పారన్నారు. ఇప్పుడు హిందువుల ఓట్లు పోతాయని గ్రహించి జనవరి 22 తర్వాత వెళతానని మాట మార్చారని నిప్పులు చెరిగారు. సిద్ధరామయ్య మాట మార్చడం వెనుక హిందువుల ఓట్లు పోతాయన్న భయమే కారణమన్నారు.

కాగా అనంతకుమార్‌ హెగ్డేకు మతిస్థిమితం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఒకసారి గెల్చిన తర్వాత నియోజకవర్గం ప్రజలకు ఆయన మొహం చూపించరని మండిపడ్డారు. ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే రాహుల్‌ కు, రాజీవ్‌ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News