మరణాన్ని ముందే ఇందిర ఊహించారా...?

ఇందిరాగాంధీ రికార్డు ని వేరే ఎవరూ కూడా బ్రేక్ చేయలేరు అన్నంతగా ఆమె సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించారు

Update: 2023-11-19 08:20 GMT

మహానుభావులకు తప్పితే ఎవరికీ భవిష్యత్తు గురించిన ఆలోచనలు తట్టవు. అయితే భారతదేశాన్ని పదహారేళ్ళ పాటు ఏకచత్రాధిపత్యం గా పాలించిన శ్రీమతి ఇందిరాగాంధీ నిజంగా గ్రేట్ విమెన్ అని చెప్పుకోవాలి. ఆమె ఆ రోజుకీ ఈ రోజుకీ దేశానికి ఏకైన మహిళా ప్రధానిగానే రికార్డు క్రియేట్ చేసి ఉంచారు.

ఇందిరాగాంధీ రికార్డు ని వేరే ఎవరూ కూడా బ్రేక్ చేయలేరు అన్నంతగా ఆమె సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించారు. దేశం లోపలా బయటా కూడా తనదైన మార్క్ వేసుకున్నారు. తూర్పు పాకిస్థాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ గా ఏర్పాటు చేశారు.

అదే విధంగా ప్రపంచ దేశాధినేతలతో ఆమె ఎక్కడా రాజీ పడకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేసారు. ఇందిర అంటే ఇండియా అనిపించుకున్నారు. ఆనాటి మహామహులు ఉద్ధండులు అయిన విపక్ష నేతల ఎత్తులను సైతం చిత్తు చేయగలిగారు. అలాగే కాంగ్రెస్ లో తన తండ్రి తరం నుంచి ఉన్న సీనియర్లతో కూడా పోరాడి తనకు ఎదురులేదు అనిపించుకున్నారు.

1966 జనవరిలో తొలిసారి భారతదేశానికి ప్రధాని అయిన ఇందిరాగాంధీ ఆ తరువాత 1977 దాకా ఏకంగా పదకొండేళ్ళ పాటు కొనసాగారు. ఈ మధ్యలో ఎమర్జెన్సీని విధించి ఆమె దేశం మొత్తాన్ని గుప్పిట పట్టారు. 1980 నుంచి 1984 వరకూ అంటే ఆమె హత్యకు గురి అయ్యేంతరకూ అయిదేళ్ల పాటు దేశాన్ని ఏలారు. అలా పదహారేళ్ల పాటు పాలించిన వీర వనితగా మహిళా నేతగా ఇందిరాగాంధీ కనిపిస్తారు.

ఇదిలా ఉంటే ఇందిరాగాంధీ దారుణ హత్యకు ఒక రోజు ముందు అంటే 1984 అక్టోబర్ 30న ఒడిషాలో సెక్రటేరియట్ వద్ద ఉన్న పెరేడ్ గ్రౌండ్స్ లో చివరి స్పీచ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె అన్న మాటలు మరణం గురించి ఆమెకు ముందే తెలుసా అన్న సందేహాన్ని కలిగించాయి.

నేను ఈ రోజు జీవించి ఉండవచ్చు. రేపు నేను బతికి ఉండకపోవచ్చు నా చిట్ట చివరి శ్వాస దాకా నేను ఈ దేశం కోసం పనిచేస్తాను నా ప్రతి రక్తపు బొట్టూ దేశం కోసం అంకితం చేస్తాను దేశ సేవలోనే నా ప్రాణాలు విడుస్తాను అని చాలా ఉద్వేగభరితమైన స్పీచ్ ని ఇందిరాగాంధీ ఇచ్చారు.

భారత దేశం అభివృద్ధి దేశంగా బలమైన దేశంగా మార్చడంలో నా పూర్తి శక్తి యుక్తులు వినియోగిస్తాను అని ఆమె చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ 1917 నవంబర్ 19న ప్రయాగ్ రాజ్ లో పుట్టారు. ఆమె 1984 అక్టోబర్ 31న ఢిల్లీలోని తన నివాసంలో అంగ రక్షకుల చేతులలో దారుణ హత్యకు గురి అయ్యారు. ఆమె అరవై ఏడేళ్ల పాటు జీవించారు.

భయం అన్నది లేకుండా ఆమె తనదైన శైలిలో రాజకీయం చేశారు. తన మరణాన్ని కూడా ఆమె ముందే ఊహించారు అంటే ఆమె గొప్ప మనిషిగానే చూడాలని అంటున్నారు. దేశ సమైక్యత సమగ్రత కోసం అసువులు బాసిన ఇందిరాగాంధీ నిజంగా మహిళా స్పూర్తిగానే చూడాలి. ఆమె నారీ శక్తికి అసలైన నిర్వచనంగానూ చూడాలి.

Tags:    

Similar News