శవాలను తవ్వి తీసి ఇష్టమైనవి పెడతారు... 'మనేన్' వేడుక తెలుసా?

సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆరోజో, మరుసటి రోజో.. వీలైనంత తొందరగా అంత్యక్రియలు పూర్తి చేస్తారు.

Update: 2024-08-21 12:30 GMT

సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆరోజో, మరుసటి రోజో.. వీలైనంత తొందరగా అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇక తర్వాత చిన కర్మ, పెద కర్మ, సంవత్సరికం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతీ ఏటా మరణించిన రోజు ఆ సమాధి దగ్గరకు వెళ్లి పూలు, పండ్లూ పెడుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే వేడుక / ఆచారం మాత్రం అందుకు పూర్తి భిన్నం. ప్రతి ఏటా మృతదేహాలను బయటకు తీసి మరీ వారికి నచ్చినవి పెడుతుంటారు.


అవును... ఇండోనేషియాలోని టొరజా జాతి ప్రజలు మరణించిన వారిని వెంటనే పూడి పెట్టరు. వారి శరీరాలకు లేపనాలు పూసి చాలా కాలం ఇంట్లోనే పెట్టుకుంటారు. అనంతరం చాలా రోజుల తర్వాత ఆ మృతదేహాలను పూడుస్తున్నారు. అలా అని ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందనుకుంటే పొరబడినట్లే. ఆ తర్వాతే అసలు వేడుక మొదలవుతుంది. పూడ్చిపెట్టిన మృతదేహాలను ప్రతీ ఏటా బయటకు తీస్తారు.


ఇందులో భాగంగా ఇండోనేషియాలో ఏటా ఆగస్టు నెల చివర్లో ఇలా తమ వారి మృతదేహాలను తవ్వి బయటకు తీస్తుంటారు ఇండోనేషియాలోని టొరాజా జాతి ప్రజలు. అనంతరం వాటిని శుభ్రం చేసి, కొత్త దుస్తులు వేసి, వారికి తలదువ్వి సిద్ధం చేస్తారు. అనంతరం వారితో ఫోటోలు తీసుకుని, కాసేపు గడిపిన తర్వాత వారికి ఇష్టమైనవన్నీ సమాధిలో ఏర్పాటు చేసి మళ్లీ పూడ్చేస్తారు.


దీనినే "మనేన్" వేడుక అని అంటారు. దీనివల్ల తమవారు సమాధుల్లో సౌకర్యవంతంగా ఉంటారనేది టోరజా ప్రజల నమ్మకం. సాధారణంగా పట్టణాలకు వలస వెళ్లిన వారంతా ఈ నెలలో తిరిగి తమ గ్రామాలకు రావడానికి ఈ ఆచారం ఏర్పాటు చేశారని కొందరు చెబితే... ఈ ఆచారం కొసమే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారంతా ఈ నెలలో సొంత గ్రామాలకు వస్తారని చెబుతుంటారు.

వాస్తవానికి ఈ మనేన్ ఆచారం కేవలం శరీరాన్ని శుభ్రపరచడం, కొత్త బట్టలు తొడగడం మాత్రమే కాదని.. అంతకంటే ఎక్కువని చెబుతుంటారు. ఈ ఆచారం మరింత లోతైన అర్ధాన్ని కలిగి ఉందని అంటారు. ఇది టోరజా ప్రజలకు - ముఖ్యంగా ముందుగా మరణించిన కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని అంటారు.

Tags:    

Similar News