అణు యుద్ధం అంచున ప్రపంచం.. అటు ఇజ్రాయెల్.. ఇటు రష్యా
వ్యూహాత్మక అణు బాంబు ప్రయోగానికి సిద్ధపడింది. తాజాగా తమ అణు విధానంలో కీలక మార్పులు చేసింది.
2022 ఫిబ్రవరి 24.. సరిగ్గా రెండున్నరేళ్ల కిందట.. ఉక్రెయిన్ పై దాడిచేసిన రష్యా అణు బాంబు దాడి తప్పదని హెచ్చరించింది. ఆ మేరకు సన్నాహాలు కూడా చేసింది. వ్యూహాత్మక అణు బాంబు ప్రయోగానికి సిద్ధపడింది. తాజాగా తమ అణు విధానంలో కీలక మార్పులు చేసింది.
డ్రోన్ దాడులు చేసినా అణు బాంబు ప్రయోగానికి వీలుగా దీనిని సవరించింది.
2023 అక్టోబరు 7.. సరిగ్గా ఏడాది కిందట ఇజ్రాయెల్ పైకి దాడులకు దిగింది హమాస్ ఉగ్ర సంస్థ.. అప్పటినుంచి యుద్ధం సాగుతోంది. అనేక పరిణామాల తర్వాత ఇది ఇప్పుడు ఇరాన్ కూ వ్యాపించింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్ పైకి 200 పైగా రాకెట్లను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలనే డిమాండ్లు ఇజ్రాయెల్ లో మొదలయ్యాయి.
ఈ రెండు పరిణామాలను చూస్తుంటే ప్రపంచం అణు యుద్ధం అంచున ఉందని కచ్చితంగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఇరాన్ అణు స్థావరాలపై దాడికి ఆదేశాలు ఇవ్వాలని ఇజ్రాయెల్ అధికార పార్టీ లికుడ్ నాయకుడు లికుద్ ఎమ్‌కే మోష్ సాద ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కోరారు. ప్రధానికి ఏది మంచో అదే చేయాలని కోరారు. ప్రస్తుత యుద్ధ సమయాన్ని ప్రత్యేక చారిత్రక అవకాశంగానూ పేర్కొన్నారు. తాము ఊరుకున్నా.. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో కాకుండా అణు బాంబులను ప్రయోగించి ఉంటే తమ ప్రజల పరిస్థితి ఏమై ఉండేది ఆయన ప్రశ్నించడం గమనార్హం. అందుకని ఇరాన్ అణు స్థావరాలపై దాడులు సాధ్యమేనని.. దీనికి ఆదేశాలు ఇచ్చేముందు అమెరికాను ఓ మాట అడగాలని సాద కోరారు. ఇప్పటివరకు ఇరాన్ పై ఇజ్రాయెల్ నేరుగా ప్రతీకారం తీర్చుకోలేదు కానీ.. ఆ మేరకు ప్రతిజ్ఞ అయితే చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ అణు స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ‘ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా.. దాని అణుస్థావరాలను ధ్వంసం చేయాలి’ అని సూచించిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ దూకూడు.. అమెరికాకు టెన్షన్..
ఇజ్రాయెల్ దూకుడు చూసి అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇజ్రాయెల్ ను ఆపగలిగేది అమెరికానే అయినా.. దానికీ వణుకు వస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఇరాన్ అణు పరీక్షలు చేపట్టిందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఈ ఫోన్ కాల్ కు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా.. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించగా.. అటు ఇజ్రాయెల్ కూడా తగ్గేదేలే అంటోంది. ఇరాన్ దాడులకు కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు చమురు క్షేత్రాలు, అణు స్థావరాల మీద కూడా దాడులకు సై అంటోంది.
అణు పరీక్ష.. 2 దేశాల్లో భూకంపం..
ఈ నెల 5న రాత్రి వేళ ఇరాన్, ఇజ్రాయెల్ భూ భాగాల్లో దాదాపు ఒకే సమయంలో భూకంపం సంభవించింది. దీంతో ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందా అనే సందేహాలు వస్తున్నాయి.