అమెరికా మిత్రదేశాలూ ఖబడ్దార్... ఇరాన్ హెచ్చరికలు ఎలా అంటే..?
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అటు సిరియాపై అమెరికా దాడులు షురూ చేసింది. అక్కడి ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులు చేస్తోంది. ఈ సమయంలో అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అవును.. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో ఇప్పుడు పశ్చిమాసియా అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా... ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇజ్రాయెల్ కు సాయం చేస్తే ఇరాన్ పై దాడికి పాల్పడినట్లే భావిస్తామని తెలిపింది.
ఇదే సమయంలో... అలా ఇజ్రాయెల్ కు సాయం చేసినట్లు తెలిస్తే టెహ్రాన్ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది. ఒకవైపు ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో... తమ శత్రువుకి సహకరిస్తే.. తమపై దాడి చేసినట్లుగానే భావిస్తామంటూ దాని మిత్రదేశాలకు ఇరాన్ ఇలా హెచ్చరికలు జారీ చేయడం ఆసక్తిగా మారింది.
మరోవైపు ఇజ్రాయెల్ కు తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్న అమెరికా.. ఇరాన్ కు కట్టడిచేసే పనుల్లో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికె ఆ దేశంపై విధించిన ఆంక్షలను విస్తరించింది. ఈ మేరకు ఇరాన్ కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై యూఎస్ ఆంక్షలు పెంచినట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది.
ఈ క్రమంలో.. 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు వివరించింది. ఇవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు అమెరికా ఆరోపించింది. దీనివల్ల.. ఇరాన్ కు నిధులు వచ్చే మార్గాలను దెబ్బతీయాలని అమెరికా చూస్తోందని అంటున్నారు!
సిరియాపై విరుచుకుపడిన అమెరికా:
ఓ వైపు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టడుకుతున్న వేళ.. మరోవైపు సిరియాపై అమెరికా దాడులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అక్కడున్న ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులు చేసింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికాతో పాటు దాని మిత్రదేశాలపైనా దాడులు చేసేందుకు ఐసిసి ప్లాన్స్ చేస్తుందనే సచ్చితమైన సమాచారంతోనే అమెరికా ముందస్తు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే... తాజాగా జరిగిన ఈ దాడుల్లో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.