రాజకీయాలకు బహు దూరం.....చిరంజీవి మాట ఇదే ఖాయం !

ఆయన కాంగ్రెస్ ని వదిలేసినా ఇంకా మావాడే అని చెప్పుకునే వారు అటు వైపు ఉన్నారు.

Update: 2025-02-11 17:09 GMT

మెగాస్టార్ చిరంజీవి నాకొద్దీ రాజకీయం అని మరో మారు గట్టిగా చెప్పారు. ఒక సినీ కార్యక్రమంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. చిరంజీవి రాజకీయాలకు దూరం అని ఎంత చెప్పినా ఆయనను దగ్గరకు లాగాలని చూసే శక్తులు ఉంటూనే ఉంటాయి. ఆయన కాంగ్రెస్ ని వదిలేసినా ఇంకా మావాడే అని చెప్పుకునే వారు అటు వైపు ఉన్నారు.

ఇక కొత్తగా బీజేపీ పెద్దలు ఆయనతో ఇపుడు సన్నిహితంగా ఉంటున్నారు. చిరంజీవి కూడా వారిని కలసి వస్తున్నారు. దాంతో మరోమారు రాజకీయ దుమారం లేచింది. చిరంజీవిని ముందు పెట్టి ఏపీలో బీజేపీ కమల వికాసానికి తెర లేపుతోందని ప్రచారం మొదలైంది.

ఇవన్నీ ఇటీవల కాలంలో బాగా ఎక్కువ అయ్యాయి. ఈ మధ్యనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో జరిపిన సంక్రాంతి వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి చరింజీవి పాల్గొన్నారు. దాంతో అదిగో చిరంజీవి బీజేపీలో చేరిపోతున్నారు అన్న పుకార్లు షికారు చేశాయి.

చాలా పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిన వేళ చిరంజీవి అపుడే రెస్పాండ్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. దాంతో ఇదే బాగుందన్నట్లుగా ప్రచారం ముమ్మరం అయింది. ఇటీవల వేవ్స్ 2025 కార్యక్రమం కోసం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పెడితే తెలుగు సీమ నుంచి చిరంజీవిని ఆహ్వానించారు. అంతే కాదు వేవ్స్ అడ్వైజరీ కమిటీలో చిరంజీవికి చోటు కల్పించారు.

దాంతో మళ్ళీ చిరు బీజేపీలో చేరుతున్నారని అందుకే ఈ గౌరవం అని అంతా మొదలెట్టారు. ఇక అక్కడితో ఆగకుండా ఈ ప్రచారం ఎంతదాకా వెళ్ళింది అంటే విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటులోకి చిరంజీవిని తీసుకుంటారు అనేంతదాకా.

వీటితో పాటుగా మరోటి తాజాగా జరిగింది. ఒక సినిమా ఫంక్షన్ లో చిరంజీవి జై జనసేన అన్న నినాదం ఇవ్వడంతో ఇక ఏముంది రేపో నేడో ముహూర్తమే. ఆయన రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు అని ఊదరగొట్టడం మొదలెట్టారు. దాంతో చిరంజీవి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు. అందుకే తాను ఇక రాజకీయాలకు దూరం అని గట్టిగా చెప్పేశారు.

అంతే కాదు జీవితాంతం రాజకీయాల ప్రసక్తి లేదని కూడా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నా తరఫున లక్ష్యాలను సేవా కార్యక్రమాలను తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారు అని కూడా చెప్పారు. అంటే రాజకీయ బాధ్యతలను తమ్ముడికే అప్పగించారు అన్న మాట. తాను పూర్తి కాలం కళామతల్లి సేవలో తపిస్తాను అన్నారు. తాను రాజకీయ పెద్దలను కలిసేది సినీ రంగానికి ఏదైనా సహకారం కోరేందుకే తప్ప రాజకీయాల కోసం కానే కాదని మెగాస్టార్ కుండబద్ధలు కొట్టారు.

మరి ఇంతలా ప్రచారం హోరెత్తిన తరువాత చిరంజీవి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కారణాలు ఏమిటి అంటే ఇది సాదర జనాలకు ఇతర పార్టీల జనాలకు అన్నింటికీ మించి బీజేపీ పెద్దలకు కూడా అన్న మాట వినిపిస్తోంది. సినీ నటుడుగా చిరంజీవికి ఉన్న చరిష్మాను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు అన్నీ చూస్తున్నాయి. అయితే తనకు ఇష్టం లేని రంగమని ఆయన సున్నితంగా తోసిపుచ్చుతున్నారు. అదే సమయంలో మొహమాటానికి ఆయన ఆయా రాజకీయ పెద్దల వేదికల మీద కనిపిస్తున్నారు.

మరి బాహాటంగా ఇంత విస్పష్టంగా ఎవరితోనూ ఆయన ముఖా ముఖీ చెప్పలేరు కనుక సినీ వేదిక మీదనే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాలకు బహు దూరమని. అయినా సరే చిరంజీవిని ఈ రాజకీయ వార్తలు ఒదిలిపెడతాయా అంటే ఏమో చూడాల్సి ఉంది మరి.

Tags:    

Similar News