షర్మిలకు ముప్పు ఎవరి నుంచి ?

షర్మిల రాజకీయంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు.

Update: 2024-10-30 22:30 GMT

కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా. ఉంటే ఎవరి నుంచి ఈ ప్రశ్నలు ఇపుడు అందరిలో కలుగుతున్నాయి. షర్మిల రాజకీయంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు. ఆమె ఎపుడూ అధికారంలో లేరు. అధికార పక్షం తరఫున కూడా నాయకురాలిగా తిరగలేదు.

గట్టిగా చెప్పాలీ అంటే ఆమె వైసీపీకి జగన్ వదిలిన బాణంగా మారి 2012 నుంచి దాదాపు కొన్ని నెలల పాటు ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. ఆనాడు ఆమె అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే విపక్షంలో బలమైన తెలుగుదేశం పార్టీని కలిపి ఘాటైన విమర్శలు చేశారు. అంతే కాదు అప్పటికి కేంద్రంలో పవర్ ఫుల్ గా ఉన్న కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ టూ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించారు. నేరుగా ఆనాటి కాంగ్రెస్ అధినాయకత్వం మీద పదునైన విమర్శలు గుప్పించారు.

మరి ఆనాడు షర్మిల ఒక సాధారణ నాయకురాలిగానే వైసీపీ తరఫున ఉన్నారు. ఇక 2019లో ఆమె వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అపుడు టీడీపీ ఏపీలో అధికారంలో ఉంది. చంద్రబాబు సీఎం గా ఉన్నారు. మరి బాబు మీద ఆయన తనయుడు లోకేష్ మీద కూడా ధాటీగా షర్మిల విమర్శలు చేశారు. మరి ఆనాడు కూడా షర్మిల ఒక మామూలు నాయకురాలిగానే ఉన్నారు.

ఆమె ఆనాడు ఏపీలో బలమైన టీడీపీ ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాను అన్న భయం ఎక్కడా కనిపించలేదు. ఇక చూస్తే ఏపీలో 2024 జనవరి లో ఆమె ఏపీకి వచ్చారు. పీసీసీ చీఫ్ గా ఆమె పగ్గాలు చేపట్టడం తోనే జగన్ మీద విరుచుకుపడ్డారు. జగన్ సీఎం గా ఉన్నారు. వైసీపీ ఎంతో బలంగా ఉంది.

మరి జగన్ ముఖ్యమంత్రిత్వంలో షర్మిల ఏపీలో ప్రతీ చోటా తిరుగుతూ ఆయన ప్రభుత్వం మీద ఇంకా చెప్పాలీ అంటే జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అపుడు కూడా ఆమెకు ఎలాంటి ప్రత్యేక సెక్యూరిటీ లేదు. ఆమె కూడా అవేమీ పట్టించుకోలేదు. మరి ఇపుడు చూస్తే ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ అధికారంలో ఉంది.

షర్మిల ఏమైనా టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారా అంటే తమలపాకుతో అలా కొట్టినట్టుగా ఒకటి రెండు విమర్శలు తప్పించి చేయడం లేదు. అలాంటపుడు అధికారం బలమైన రాజ్యం చేతిలో ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేనట్లే.

ఇంకో వైపు జగన్ మాజీ సీఎం అయ్యారు. ఆయనకు సెక్యూరిటీ తగ్గిందనే వైసీపీ విమర్శలు చేస్తోంది. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇపుడు ఇబ్బందుల్లో ఉంది. అది చాలదన్నట్లుగా ఆస్తుల వివాదంలో అన్ని వేళ్ళూ వైసీపీ అధినాయకత్వం మీద చూపిస్తూ వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ దానికి పూర్తిగా స్కోప్ ఇచ్చింది జగనే అనుకోవాల్సి ఉంటుంది.

మరి ఈ పరిస్థితులలో షర్మిల వర్సెస్ జగన్ ఆస్తుల వివాదం చెలరేగింది. ఇది అతి పెద్ద చిచ్చుగా మారింది. ఇందులో కొన్ని సంబంధం లేని పార్టీలు రాజకీయం పులిమి చలి మంట కాచుకున్నాయి. ఇదిలా ఉంటే ఇపుడు షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని ప్రచారం సాగుతోంది

ఆమెకు అర్జంటుగా టూ ప్లస్ సెక్యూరిటీ నుంచి ఫోరు ప్లస్ సెక్యూరిటీని పెంచాలని డిమాండ్ ని కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్నారు. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు డీజీపీని కలసి వినతిపత్రం సమర్పించారు. ఇంతకీ షర్మికకు ముప్పు ఎవరి నుంచి అన్న ప్రశ్న వస్తోంది.ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి అయితే ఆమెకు ఏ ముప్పూ లేదని అంటున్నారు. పైగా టీడీపీ కూటమికి కావాల్సిన ఆయుధాలను షర్మిల తన వ్యక్తిత అజెండాను బయటకు తీసి మరీ అందిస్తున్నారు అని అంటున్నారు.

అలాంటపుడు ఎవరి నుంచి అంటే వైసీపీ వైపు నుంచా అన్న చర్చ ఉంది. కానీ బుర్ర ఉన్న వాడూ లాజిక్ తెలిసిన వారూ అయితే దీనిని ఏ మాత్రం నమ్మరు కదా అడ్డంగా కొట్టి పారేస్తారు. ఎందుకంటే ఇప్పటికే షర్మిలతో పెట్టుకుని వైసీపీ సర్వ భ్రష్టత్వం చెందింది. ఇక ఆమె విషయంలో మరేదైనా జరిగితే వైసీపీ ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో రాజకీయం చేసే వారికి తెలిసిన వారికీ బాగా ఎరుకే. అందువల్ల షర్మిలకు వైసీపీ వైపు నుంచి అయితే ఏ ముప్పూ లేదనే చెప్పాల్సి ఉంటుంది.

మరి ఆమెకు ఎందుకు సెక్యూరిటీ సమస్య వచ్చింది అంటే అదే అర్ధం కాదని అంటున్నారు. అయితే ఇది కూడా రాజకీయంగా చూడాలా అంటే ఎవరికి వారే ఆలోచించుకోవాలి. అయితే ఆమె ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఏపీకి చీఫ్ గా ఉన్నారు. ఆమె సెక్యూరిటీ పెంచమని కోరారు. ఆమెకు ఆ దిశగా ఏమైనా ఇబ్బంది ఉంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం సెక్యూరిటీని పెంచుతుంది. అది అంతే. అంతకు మించి ఈ విషయానికి ప్రాముఖ్యత ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News