జనసేనలోకి మెగా-అల్లు కుటుంబాల మధ్య చిచ్చు రేపిన శిల్ప? పవన్ ఓకే అంటారా?
ఈ విషయాన్ని టీడీపీకి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బయటపెట్టడంతో రాజకీయంగా ఆవిష్కృత చర్చ జరుగుతోంది.
ఎక్కడా లేని రాజకీయాలు ఏపీలోనే కనిపిస్తాయి. అనుకోని ట్విస్టులు.. ఊహించని మలుపులు అన్నీ ఏపీ పాలిటిక్స్ లో కనిపిస్తుంటాయి. అదే సమయంలో చిన్నచిన్న విషయాలు అతిపెద్ద వివాదాలకు కారణమవుతుంటాయి. గత ఎన్నికల ముందు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ను రాజకీయ వివాదంలోకి నెట్టేసిన శిల్పా కుటుంబం జనసేన వైపు చూస్తుందనే ప్రచారం తాజాగా వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బయటపెట్టడంతో రాజకీయంగా ఆవిష్కృత చర్చ జరుగుతోంది.
రాజకీయ విమర్శలో.. ప్రత్యర్థిని దెబ్బతీయాలనే వ్యూహమో కానీ ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పొలికల్ బాంబ్ పేల్చారు. తమ చిరకాల రాజకీయ ప్రత్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి జనసేనలోకి వెళ్లేందుకు చూస్తున్నారని ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు. నంద్యాలలో భూమా-శిల్పా కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఉప్పు-నిప్పులా రాజకీయం నడుస్తుంటుంది. 2014లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీలో ఉండగా, భూమా కుటుంబం టీడీపీలో ఉండేది.
ఎన్నికల తర్వాత భూమా కుటుంబం టీడీపీలో చేరడంతో నంద్యాల ఉప ఎన్నికల ముందు శిల్పా వైసీపీలో చేరారు. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, చక్రపాణిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి శిల్పా సోదరుడి కుమారుడు శిల్పా రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా భూమా కుటుంబాన్ని ఓడించారు. 2024 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి టీడీపీ భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వకపోయినా, ఆ నియోజకవర్గంలో భూమా ఆధిపత్యమే కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో శిల్పా జనసేనలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారని ఎమ్మెల్యే అఖిలప్రియ చెప్పడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అధికారం లేకపోతే ఉండలేని శిల్పా చక్రపాణి రెడ్డి తన ఆస్తులను కాపాడుకోడానికి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు అఖిలప్రియ. అయితే జనసేనలోకి చక్రపాణిరెడ్డి ఎంట్రీ సాధ్యమా?అనే ఇంట్రస్టింగ్ పాయింట్ లేవనెత్తుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎన్నికల ముందు నంద్యాలలో వైసీపీ తరఫున పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రచారం చేయడం రాజకీయంగా వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మెగా-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని టాక్ నడిచింది. ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో శిల్పా జనసేనలోకి ఎంట్రీ అన్న పాయింట్.. రాజకీయంగా చాలా ఇంట్రస్టింగ్ అంటున్నారు.
అఖిలప్రియ చెప్పినట్లు శిల్పా జనసేనతో సంప్రదింపులు జరిపితే మెగా-అల్లు కుటుంబం మధ్య పొడసూపిన విభేదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటున్నారు. అయితే తన రాజకీయ ప్రత్యర్థిని దెబ్బతీయడానికే అఖిల ఇలా ముందుగా ప్రకటించి రాజకీయంగా గందరగోళం సృష్టించాలని ప్లాన్ చేసి ఉంటారని కూడా అనుమానిస్తున్నారు. ఏదైనా రాయలసీమ రాజకీయాల్లో ఈ టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది.