వైసీపీలో వయసు బాధ...అందుకే అలా ?

ఇక్కడ ఎవరు ఎపుడు రాజు అవుతారో తరాజు అవుతారో అర్ధం కాదు, అసలు తెలియదు.

Update: 2024-08-29 17:30 GMT

రాజకీయాల్లో టైమింగ్ ముఖ్యం అని అంటారు. అలాగే వయసు కూడా ముఖ్యమని కొత్తగా అర్ధం అవుతోంది. రాజకీయాలు ఎవరైనా ఒక వయసులోనే చేస్తారు. అలాగే చేయాలని అనుకుంటారు. పైగా రాజకీయాల్లో చూస్తే ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలుయదు. ఇదంతా ఒక మాయాజాలం. ఇక్కడ ఎవరు ఎపుడు రాజు అవుతారో తరాజు అవుతారో అర్ధం కాదు, అసలు తెలియదు.

అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెత పుట్టింది. అదే పని ఎపుడూ రాజకీయ నేతలు చేస్తారు. దాన్నే టైమింగ్ అని అంటారు. ఇక వైసీపీ పరిస్థితి చూస్తే జగన్ నాయకత్వంలో ఉన్న పార్టీ. జగన్ వయసు అయిదు పదుల మాటే. ఆయన రాజకీయంగా చూస్తే యువకుడే. కానీ ఆయన పార్టీలో ఉన్న వారు అంతా ఆ ఏజ్ లో లేరు. వారిలో ఆరు పదులు దాటిన వారు రాజకీయంగా సీనియర్ మోస్టు లీడర్లు ఉన్నారు.

వారికి మాత్రం ఈసారి ఎన్నికల్లో పరాజయం షాక్ గానే ఉంది. మరో అయిదేళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడచిపోతాయి అని జగన్ అధినేత హోదాలో చెప్పవచ్చు. కానీ అయిదేళ్ళు అన్నవి అధికారంలో ఉన్నపుడు అలాగే కరిగిపోవచ్చు. కానీ విపక్షంలో ఉన్నపుడు అవే పెను భారంగా మారుతాయి. ఒక్కో దినమూ కడు భారం అవుతుంది.

ఇక సీనియర్ నేతలు తమ వారసులను తయారు చేయాలని అనుకుంటున్నారు. తాము కాస్తా పలుకుబడిలో ఉండగానే వారికి రాజకీయ బాట చూపించాలని అనుకుంటారు. మరో అయిదేళ్లు ఓడిన పార్టీలో ఉన్నా అప్పటికీ అవకాశాలు రాకపోతే లేదా ఆ పార్టీ మరోసారి పరాజయం బాట పడితే అపుడు తమ సంగతేంటి అన్న చింత వారిలో కచ్చితంగా ఉంటుంది.

జగన్ అయితే నాకు వయసు తక్కువ. మళ్లీ పాదయాత్ర చేయగలను అదే బలం అదే దూకుడు తనకు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు కదా. అందుకే వయసు మీరిన వారు ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కొందరు నేతలు ఏమో కాడె వదిలేస్తున్నారు. మరి కొందరు వారసులను ఏ పార్టీలో పెడతామని ఆలోచిస్తున్నారు. మరి కొందరు చేతిలో పదవి ఉంటే దాంతో రాజకీయ బేరానికి దిగి తమకు తమ వారికీ సరైన చోటు దక్కేలా చూసుకుంటున్నారు.

మొత్తానికి చూస్తే కనుక ఈ జంపింగులలో అర్ధాలు పరమార్థాలు బోలెడు ఉన్నాయి. ఎవరూ కూడా ఊరకే జంప్ చేయరు. అది సరైన జంప్ కాకపోతే కాళ్లు విరుగుతాయి. పరువు పోతుంది. అందువల్ల అన్నీ ఆలోచించే ఇలా చేస్తున్నారు అనుకోవాలి. ఏది ఏమైనా ఓడిన పార్టీ ఓటి పడవ లాంటిది అని అంటారు. ఆ పడవలో కూర్చుని ఒడ్డు దాకా సాఫీగా ప్రయాణం చేయలేమని అనుమానాలు చాలా మందిలో ఉంటాయి.

గతంలో టీడీపీ హయాంలో కూడా ఇలాగే జరిగింది. అపుడు చంద్రబాబు వయసు గురించి చింతతో చాలా మంది వైసీపీ వైపు వచ్చారు. అలాగే బీజేపీ వైపు కొందరు వెళ్లారు. కానీ ఇపుడు పార్టీలో తమ వయసును చూసును 2029 అన్న సుదీర్ఘమైన ప్రయాణం గురించి ఆలోచన చేస్తూ ఈ తరహా ఫిరాయింపులకు పాల్పడుతున్నారు అని అంటున్నారు.

వైసీపీ ఇపుడు చేయాల్సింది వయసు బెంగ లేని నేతలను చేరదీయడం. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలకు అవకాశాలు ఇవ్వడం. జగన్ తనతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు గతంలో అవకాశాలు ఇచ్చి వారు రుణం తీర్చుకున్నారు. ఇపుడు ఆ రుణం తీరిపోయినట్లే అని అంటున్నారు. అందువల్ల జగన్ అప్పట్లో అన్న ఎన్టీఆర్ చేసినట్లుగా కొత్త రాజకీయానికి కొత్త రక్తానికి పార్టీలో చోటివ్వాలి. అపుడే వైసీపీ బట్టకడుతుంది.

అంతే తప్ప తమ కుటుంబానికి విధేయులు అనో లేక తమను నమ్ముకున్నారనో తెచ్చి పెట్టి నాయకులను చేస్తే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో ఇమడలేని వారు వేయి కారణాలు చెబుతున్నారు. దానికి కాలం కూడా సహకరిస్తోంది. వైసీపీకి ముందుంది ముసళ్ళ కాలం అన్నది పచ్చి నిజం. దానిని దాటుకుని ముందుకు సాగితేనే ఏ ఒడ్డు అయినా కనిపించేది అన్నది కఠినమైన అసలైన వాస్తవం.

Tags:    

Similar News