వైసీపీకి సూపర్ ఛాన్స్... వాడుకుంటుందా.. వదులుకుంటుందా..!
త్వరలోనే రాష్ట్రంలో రెండు కీలక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి మంచి అవకాశం చిక్కింది. పార్టీ అధినేత జగన్ తరచుగా చెబుతున్నట్టు.. చంద్రబాబు పాపాలు పండాయి. ప్రజలు మనతోనే ఉన్నారని.. అన్నట్టుగా అలా .. ఉన్నారో లేదో.. చంద్రబాబు పాపాలు నిజంగానే పండాయో లేదో తెలుసుకునేందుకు ఆయనకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. అదే.. గ్రాడ్యుయేట్ ఎన్నికలు. త్వరలోనే రాష్ట్రంలో రెండు కీలక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి పార్టీలతో ప్రమేయం లేకుండా.. ఆయా పట్టభద్రుల నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు పాల్గొనే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉమ్మడి కృష్నా, గుంటూరు జిల్లాలకు ఒక స్థానం, ఉభయ గోదావరి జిల్లాలకు మరో స్థానం దక్కింది. వీటికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున పట్టభద్రులను నిలబెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. ఇప్పటికే టీడీపీ కూటమి పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. టీడీపీ తరఫున మాజీ మంత్రి, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఖరారు చేశారు.
మరో నేత ఎంపికలో చర్చలు నడుస్తున్నాయి. ఇక, కమ్యూనిస్టుల మద్దతుతో మరో ఇద్దరు నేతలు రంగం లోకి దిగుతున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ కూడా రంగంలోకి దిగి.. తన సత్తాను నిరూపించుకునే అవకాశం ఉంది. అదేసమయంలో జగన్ చెబుతున్నట్టు ప్రబుత్వ వ్యతిరేకత ఈ నాలుగు మాసాల్లోనే పెరిగిపోయి ఉంటే.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు.. గ్రాడ్యుయేట్ల ఓట్లను వైసీపీ అభ్యర్థికి పడేలా చేసుకునేందుకు జగన్ కు ఇదొకచక్కని అవకాశం.
అదే సమయంలో పార్టీలోనూ ఉత్తేజం నింపేందుకు.. వైసీపీ పని అయిపోలేదు.. పుంజుకుందని చెప్పేం దుకు కూడా జగన్‌కు ఈ ఎన్నికలు దోహద పడనున్నాయి. ఒకవేళ.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కనుక వైసీపీ పుంజుకుంటే.. మండలిలోనూ పోయిన బలం వస్తుంది. మరింత పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా చూసుకున్నా.. జగన్ కు ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి సద్వినియోగం చేసుకుంటారో.. చూస్తూ ఊరుకుంటారో చూడాలి.